నిజామాబాద్‌పై పట్టు కోసమే

19 Mar, 2020 02:23 IST|Sakshi

ప్రస్తుతం మండలికి కవిత.. వీలునుబట్టి కేబినెట్‌లోకి

డీఎస్, అరవింద్‌ ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసే వ్యూహం

కవితకు లైన్‌ క్లియర్‌ చేసేందుకు రాజ్యసభకు సురేశ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలి నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 12న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా టీఆర్‌ఎస్‌ పక్షాన పలువురు ఆశావహులు పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. అయితే పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ మాత్రం తన కుమార్తె, నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవిత అభ్యర్థిత్వం వైపు మొగ్గుచూపారు. కవిత అభ్యర్థిత్వంపై సోమవారం రాత్రి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం అందించినట్లు సమాచారం. అయితే మండలి స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా కవిత నామినేషన్‌ వేస్తున్న విషయం మంగళవారం రాత్రి పార్టీ కేడర్‌కు సంకేతాలు అందాయి.

ఈ నేపథ్యంలో మంత్రుల నివాస సముదాయంలో బుధవారం ఉదయం నిజామాబాద్‌ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పాటు జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలతో కవిత మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం మంత్రి వేముల, పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నామినేషన్‌ దాఖలు చేసేందుకు నిజామాబాద్‌కు కవిత బయలుదేరి వెళ్లారు. బుధవారం శాసన మండలి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన కవితను వేద పండితులు ఆమె నివాసంలో కలిసి ఆశీర్వచనాలు అందజేశారు. 

టీఆర్‌ఎస్‌కు 532 ఓటర్లు
2014 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ ఎంపీగా పార్లమెంటులో కవిత అడుగుపెట్టారు. 2019 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా రెండో పర్యాయం టీఆర్‌ఎస్‌ పక్షాన నిజామాబాద్‌ నుంచి పోటీ చేసిన కవిత ఓటమి చవిచూశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కవిత పార్టీ కార్యకలాపాల్లో అంతగా కనిపించడం లేదు. ఈ నెల 13న జరిగిన రాజ్యసభ సభ్యుల నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు అసెంబ్లీకి వచ్చిన కవిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అదే రోజు కవిత జన్మదినం కావడంతో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే నిజామాబాద్‌ శాసనమండలి స్థానిక సంస్థల కోటా అభ్యర్థిగా జిల్లాలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పార్టీ అభ్యర్థిగా కవితను సీఎం కేసీఆర్‌ ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. స్థానిక సంస్థల కోటాకు సంబంధించి జిల్లాలో 824 మంది ఓటర్లు ఉండగా, టీఆర్‌ఎస్‌కు 532, కాంగ్రెస్‌కు 140, బీజేపీకి 85 ఓట్లు ఉన్నాయి. దీంతో శాసన మండలికి కవిత ఎన్నిక అత్యంత సునాయాసంగా జరుగుతుందని లెక్కలు వేసి బరిలోకి దించినట్లు తెలిసింది.

వీలును బట్టి మంత్రిమండలిలోకి?
మండలికి కవిత ఎంపిక వ్యూహాత్మకంగా జరిగిందని పార్టీ నేతలు భావిస్తున్నారు. కవితకు మార్గం సుగమం చేసేందుకు మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డిని రాజ్యసభకు పంపడంతోపాటు, కవితను స్థానిక సంస్థల కోటాకు ఎంపిక చేయడం ద్వారా దొడ్డిదారిన మండలికి వచ్చారనే అపప్రథ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌కు పట్టు ఉన్న నిజామాబాద్‌లో డి.శ్రీనివాస్‌తో పాటు, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ దూకుడుకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా కవిత ఎంపిక జరిగినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. కవితను కేబినెట్‌లో తీసుకునే ఉద్దేశంతోనే మండలికి ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా