తీర్థయాత్రలకు వెళ్లినట్లుంది

11 Nov, 2018 02:45 IST|Sakshi

కాంగ్రెస్‌ బృందంపై ఎంపీ కవిత విసుర్లు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: గల్ఫ్‌ వలసలకు కాంగ్రెస్, టీడీపీ పార్టీలే కారణమని నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. వంద ఎలుకలను మింగిన పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరిన చందంగా కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు దుబాయ్‌కి వెళ్లి గల్ఫ్‌ బాధితుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. శనివారం నిజామాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ పాలకులు ఇక్కడి యువతకు స్థానికంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ముంబై.. దుబాయ్‌.. బొగ్గుబాయి అనే నినాదంతో ప్రజలు ఉద్యమించారని గుర్తు చేశా రు. 2006లో గల్ఫ్‌ సెల్‌ను ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ సర్కారు ఐదేళ్ల కాలంలో నయా పైసా బడ్జెట్‌ కేటాయించకుండా నెట్టుకొచ్చిందన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రూ.106 కోట్లు గల్ఫ్‌ బాధితుల కోసం వెచ్చించిందన్నారు. గతంలో గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన వారు అక్కడ మరణిస్తే వారి కుటుంబసభ్యులు కడసారి చూపు కూడా నోచుకోలేని స్థితి ఉండేదన్నారు. టీఆర్‌ఎస్‌ హయాంలో వివిధ దేశాల్లో మరణించిన 1,278 మంది మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించిందని గుర్తుచేశారు.

మరిన్ని వార్తలు