మహిళా శక్తిని చాటుతా

29 Mar, 2019 08:41 IST|Sakshi
నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కవిత

చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం కోసం ఓ మహిళా సభ్యురాలిగా తన వంతు కృషి చేస్తానని నిజామాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత హామీ ఇస్తున్నారు. ఇందుకోసం పార్లమెంట్‌ సమావేశాల్లో తన గళం వినిపిస్తానని అన్నారామె. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన స్ఫూర్తితోనే ఓ ఆడబిడ్డగా మహిళల అభ్యున్నతి కోసం శక్తివంచన లేకుండా పని చేస్తానని చెప్పారు కవిత. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, ముఖ్యంగా  నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సమస్యలపై పార్లమెంట్‌ సమావేశాల్లో అనేక సందర్భాల్లో  ప్రస్తావించిన సంగతి గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల రణక్షేత్రంలోకి దిగిన కవిత ఆడపడుచుల అభ్యున్నతికి చేపట్టనున్న ప్రత్యేక కార్యాచరణను ‘సాక్షి’తో పంచుకున్నారు.

సంపూర్ణాభివృద్ధి
నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ప్రాంతం వ్యవసాయ పరంగా ముందంజలో ఉంది. ఇతర ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ పరిశ్రమలు తక్కువే. ఒక ప్రాంతం అన్నిరంగాల్లో సమగ్రాభివృద్ధి చెందాలంటే వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి కూడా జరగాలి. రాష్ట్రంలో వీ–హబ్‌ పేరుతో మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు జరుగుతోంది.  

ప్రత్యామ్నాయ ఆదాయమార్గం
అత్యంత వెనుకబడిన కులాల సంక్షేమం కోసం ప్రత్యేకంగా దృష్టి సారిస్తాను. ఎలాంటి కులవృత్తి లేని ఎంబీసీ (మోస్ట్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌)లకు ప్రత్యామ్నయ ఆదాయ వనరుల కల్పన కోసం కృషి చేస్తా. నిరుపేద ప్రజల సొంతింటి కలను తీరుస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటి నిర్వహణలో ఎంబీసీ మహిళలను భాగస్వాములను చేయడం వల్ల మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించగలుగుతారు. ఈ యూనిట్‌ల ద్వారా రైతుల ఉత్పత్తులకు మంచి ధర కూడా పలుకుతుంది.

కె. కవిత
తల్లిదండ్రులు : కల్వకుంట్లచంద్రశేఖర్‌రావు, శోభ
భర్త, పిల్లలు : అనీల్‌కుమార్,ఆదిత్య, ఆర్య
స్వస్థలం: చింతమడక గ్రామం,సిద్దిపేట జిల్లా
విద్యాభ్యాసం: హైదరాబాద్, మాస్టర్స్‌ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ (యూఎస్‌).

కాళేశ్వరంతో నీటి పంట
ఏళ్లుగా పరిష్కారం కాని నిజామాబాద్‌–పెద్దపల్లి రైల్వేలైను పనులును పూర్తి చేయించాను. నియోజకవర్గ ప్రాంతానికి రైల్వే కనెక్టివిటీని పెంచడానికి కృషి చేస్తాను. వ్యవసాయ పరంగా క్షేత్ర స్థాయిలో సమూల మార్పులు జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని నెలల్లో పూర్తి కానుంది. ఆ ప్రాజెక్టుతో నిజామాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని ఆరు లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.

తగ్గని అభిమానం
ఐదేళ్లలో నిజామాబాద్‌ ప్రజల ప్రేమాభిమానాలను పొందగలిగాననే అనుకుంటున్నా. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేశాను. పసుపుబోర్డు సాధన కోసం మెథాడికల్‌గా పనిచేశాను. పసుపు పండించే రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్దతు మొదలుకుని.. చివరి అస్త్రంగా పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు కూడా పెట్టాను. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా శక్తి వంచన లేకుండా పనిచేశాను. గల్లీలో తెలంగాణ ప్రజలకు సేవ చేస్తూ, ఢిల్లీలో తెలంగాణ రక్షణ కోసం సైనికురాలిగా పనిచేశాను. నిజామాబాద్‌ ప్రజలు తప్పకుండా మళ్లీ నన్ను ఆదరించి, ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. ఈసారి గెలిచిన తర్వాత మహిళల రిజర్వేషన్‌ బిల్లు చట్టంగా రావడానికి ప్రయత్నిస్తాను. పార్టీలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకుని గళాన్ని వినిపిస్తాను.  – పాత బాలప్రసాద్‌ గుప్తా,సాక్షి– నిజామాబాద్‌ ప్రతినిధి

మరిన్ని వార్తలు