ఉన్నం వర్సెస్‌ ఉమా

12 Oct, 2019 08:47 IST|Sakshi
ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమా వర్గీయుల వాగ్వాదం

కళ్యాణదుర్గం టీడీపీ కార్యాలయంలో ఉద్రిక్తత

అనంతపురం,కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పార్టీ ఇన్‌చార్జ్‌ ఉమామహేశ్వరనాయుడుల మధ్య శుక్రవారం ఘర్షణ జరిగింది. ఇరువురి మధ్య ఘర్షణతో రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో పార్టీ కార్యాలయంలో ఉద్రిక్తతకు దారి తీసింది.ఎన్నికల అనంతరం తాజా మాజీ ఎమ్మెల్యే ఉన్నం టీడీపీ కార్యాలయానికి అడపాదడపా వచ్చి వెళ్లేవారు. పార్టీ కార్యాలయ మరమ్మతులు జరుగుతుండటంతో ఇటీవల కార్యాలయానికి రాలేదు. దసరా పండుగ రోజు కార్యాలయానికి వచ్చి వెళ్లారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉన్నం టీడీపీ కార్యాలయానికి వచ్చారు.

కొద్దిసేపు నాయకులు, కార్యకర్తలతో ముచ్చటించి వివాహ కార్యక్రమానికి బయల్దేరారు. వాహనంలో బయలుదేరి వెళ్తుండగా టీడీపీ ఇన్‌చార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు వాహనంలో కార్యాలయానికి వచ్చి లోపలికి వెళ్తూ వైఎస్సార్‌సీపీకి ఓట్లేసిన వారు పార్టీ కార్యాలయానికి వచ్చే అర్హత ఏముంటుందంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఉమా వ్యాఖ్యలను అనుచరులు ఉన్నం దృష్టికి తీసుకొచ్చారు. ‘రావొద్దనడానికి కార్యాలయం వారి అబ్బ సొమ్మా.. పెద్దాయనా.. వాహనం దిగు.. తిరిగి కార్యాలయంలోకి వెళ్దాం’ అని కార్యకర్తలు పట్టుబట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన ఉన్నం తనపై ఆరోపణలు చేసిన వారు ఎవడంటూ తీవ్ర పదజాలంతో కార్యాలయంలోకి వెళ్లారు. ఈ సందర్భంలో ఇరు వర్గీయుల మధ్య వాగ్వాదం, తోపులాటలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా పార్టీ కార్యాలయంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అక్కడున్న ద్వితీయ శ్రేణి నాయకులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. అనంతరం ఉన్నం అక్కడి నుంచి నిష్క్రమించగా.. ఉమా మహేశ్వర నాయుడు వర్గీయులు మరికొంతమంది పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు