రాజకీయ రంగంలోకి కమల్‌ హాసన్‌

11 Mar, 2019 20:24 IST|Sakshi

సాక్షి వెబ్ ప్రత్యేకం : స్వాతి ముత్యం లాంటి స్వచ్చమైన నటనైనా.. సాగర సంగమంలాంటి విషాదమైనా.. విచిత్ర సోదరుల్లాంటి ప్రయోగానికైనా తన నటనతో ప్రాణం పోసే నటుడు కమల్‌హాసన్‌. రీల్‌ లైఫ్‌లో నాయకుడు, క్షత్రియ పుత్రుడు లాంటి సినిమాల్లో తన చుట్టూ ఉన్న జనం కోసం పోరాడిన కమల్‌.. రియల్‌ లైఫ్‌లోనూ జనం తరపున నిలబడేందుకు సిద్దమయ్యారు. మరి ఈ దశావతార పురుషుడు.. రాజకీయ చదరంగంలో నిలదొక్కుకునేందుకు రెడీ అయ్యారు. తన ప్రత్యర్థులకు చెక్‌ పెట్టి.. రియల్‌ లైఫ్‌లోనూ ‘నాయకుడు’గా ప్రజల ముందుకొస్తున్నారు కమల్ హాసన్. 

చిత్ర పరిశ్రమలో గొప్ప నటుడిగా జాతీయ స్థాయిలోనే గాక ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది యూనివర్సల్‌ హీరోగా కీర్తి గడించారు కమల్‌ హాసన్‌. తన సినిమాలతో, నటనతో అంతులేని అభిమాన గణాన్ని సొంతం చేసుకుని.. నటుడు, దర్శకుడు, నిర్మాత, డ్యాన్సర్‌, సింగర్‌గా అనేక విభాగాల్లో తనదైన ముద్రను వేశారు. బుల్లితెరపైనా బిగ్‌బాస్‌ షోతో.. తన చతురతను ప్రదర్శించారు. రాజకీయ రంగంలో మార్పులు తెచ్చి, ప్రజలు మెచ్చే పాలనను అందించేందుకు అడుగులు వేస్తున్నారు. జయలలిత మరణంతో ఏర్పడిన శూన్యాన్ని పూరించడానికి, రాజకీయ అవినీతిని రూపుమాపేందుకు రాజకీయ పార్టీని స్థాపించారు. నాస్తికత్వ భావనలు కల కమల్‌ హాసన్‌ బ్రాహ్మణ సమాజానికి చెందినవారు. దేవుడి ఉనికి ప్రశ్నిస్తూ.. సెక్యులర్‌ భావజాలం ఉన్న కమల్‌ హాసన్‌.. మక్కల్‌ నీది మయ్యం పార్టీని స్థాపించి.. రాజకీయం అరంగేట్రం చేశారు. కాంగ్రెస్‌, డీఎంకేతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ విధానాలపై విమర్శనాస్త్రాలను సంధిస్తూ.. ముక్కు సూటిగా వ్యవహరించడం కమల్‌ శైలి.

కుటుంబ నేపథ్యం
శ్రీనివాసన్‌-రాజ్యలక్ష్మీ దంపతులకు 1954 నవంబర్‌ 7న రామనాథపురంలోని పరమక్కుడిలో కమల్‌ హాసన్‌ జన్మించారు. కమల్‌ హాసన్‌.. బాల నటుడిగా ‘కలత్తూర్ కన్నమ్మ’తో సినీ రంగంలోకి ప్రవేశించారు. తన సినిమాల్లోని వివాదాలతో ఆయన కంటతడి పెట్టిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. నాటి క్షత్రియ పుత్రుడు సినిమా నుంచి మొన్నటి విశ్వరూపం వరకు వివాదాలతో సహవాసం చేశారు. సినిమాల్లోని కథ, పాటలు, మాటలు ఇలా ఏదో ఒకటి ఏదో ఒక వర్గాన్ని వెలేత్తి చూపడంతో వివాదాలు రాజుకునేవి. ప్రభుత్వాలు కూడా కక్ష కట్టేవి. 

కమల్‌ తన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ప్రపంచ ఖ్యాతీ గడించిన భరతనాట్య కళాకారిణి వాణీ గణపతిని 1978లో వివాహామాడి 1988లో విడాకులు తీసుకున్నారు కమల్‌. అటుపై 1988లో సినీ నటి సారికను వివాహం చేసుకుని 2004లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి శ్రుతీ హాసన్‌, అక్షర హాసన్‌లు జన్మించారు. అటుపై మళ్లీ నటి గౌతమితో కొంతకాలం సహజీవనం చేశారు. కమల్‌ హాసన్‌ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శ్రుతీ హాసన్‌.. అక్షర హాసన్‌లు బాగానే రాణిస్తూ ఉన్నారు. అయితే వీరు సోషల్‌ మీడియాలోని కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. స్వతంత్ర భావాలు కలిగిన కమల్‌.. తన కూతుళ్లను కూడా అదే విధంగా పెంచానని.. తమకు కుల, మత, ప్రాంత బేధాలు ఉండవని చెబుతారు.
- బండ కళ్యాణ్‌

మరిన్ని వార్తలు