సిగరెట్‌ కాల్చడం మానేయండి: కమలహాసన్‌

4 Apr, 2019 08:05 IST|Sakshi

మాది ‘బీ’ టీమా?

చెన్నై, పెరంబూరు: మాది బీ టీమా? అని మండిపడ్డారు మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌. అసలు సంగతేమిటంటే ఈయన పార్టీ పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు, రాష్ట్రంలో జరగనున్న 18 శాసనసభ ఉప ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. పనిలో పనిగా అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలను ఏకి పారేస్తున్నారు. దీంతో ఆ డ్రావిడ పార్టీలు కమలహాసన్‌ పార్టీపైనా ఎదురు దాడికి సిద్ధం అయ్యారు. కమలహాసన్‌ పార్టీ బీజేపీకి బీ టీమ్‌ అని వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కమలహాసన్‌ మండిపడ్డారు. 

ఈయన మీడియాకిచ్చిన భేటీలో తన పార్టీని బీ టీమ్‌ అంటున్న ఇదే కూటములు ఢిల్లీలో ఏ ప్రధాని త్రాసు బరువు తగ్గుతుందో అ పక్కకు గుర్రాన్ని అమ్మబోతారు చూడండి అని అన్నారు. ప్రధానమంత్రి పదవికి ఇతరుల అవసరం ఏర్పడితే వీళ్లు గుర్రం బేరానికి పాల్పడతారని అన్నారు. స్థానిక అన్నాశాలలోని బ్రిడ్జి  సమీపంలో గుర్రాన్ని పట్టుకుని ఒక శిల ఉంటుంది. అదే డీఎంకే అని అన్నారు. చేరకూడని వంచకుల కూటమిలో తన కమ్యునిస్ట్‌ సోదరులు చేరారని అన్నారు.

రాజకీయాలు ఇలా ఉండకూడదన్న భావంతోనే తాను వచ్చానని అన్నారు. రాజకీయాల్లో ఒక పార్టీ మంచి చేస్తే దాన్ని తుడిచేయడానికి మరో పార్టీ ప్రయత్నిస్తుందన్నారు. మంచి పథకాలను అమలు పరచనీయని సంస్కృతి మారాలన్నారు. అన్నాడీఎంకే, డీఎంకే రెండు పార్టీలు మారతాయన్న నమ్మకమే పోయిందని అన్నారు. ఇక ఆ పార్టీలకు కాలం చెల్లిందని అన్నారు. తాము ఇంకో వందేళ్లు ఉంటామని వారు చెప్పుకోవచ్చునని, వారు మరో నూరేళ్లు ఉండరాదన్నదే తమ ప్రయత్నం అని కమలహాసన్‌ అన్నారు.

వైదొలుగుతున్న నిర్వాహకులు
ఇదిలాఉండగా మక్కళ్‌ నీది మయ్యం పార్టీ నుంచి నిర్వాహకుల తొలగింపులు, వైదొలగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. కమలహాసన్‌ ఒక పక్క ఓట్లను రాబట్టుకునే కార్యక్రమలను చేస్తుంటే అసంతృప్తులు దూరం కావడం పార్టీని ఇబ్బంది పెట్టే చర్యే అవుతుంది. తిరునెల్వేలి జిల్లాకు చెందిన ముఖ్య నిర్వాహకులిద్దరు తాజాగా మక్కళ్‌ నీది మయ్యం పార్టీని వీడారు. ఆ మధ్య తిరునెల్వేలి జిల్లా పార్టీ నిర్వాహకుడు సెంథిల్‌కుమార్, జిల్లా పశ్చిమ నిర్వాహకుడు కరుణాకరరాజా కమల్‌ పార్టీ నుంచి వైదొలిగారు.

వారు మంగళవారం పార్టీని వీడుతున్నట్లు లేఖ రాసిన కొద్ది సేపటికే వారిని తొలగిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యాలయం ప్రకటించింది. దీనంతటికీ కారణం నెల్‌లై పార్లమెంట్‌ స్థానానికి మక్కళ్‌ నీది మయ్యం తరఫున వెన్నిమలై అనే అభ్యర్థిని ఎంపిక చేశారు. ఆయన చెన్నైలో వ్యాపారస్తుడు. నెల్‌లైలో ఈయనకు ఎవరితోనూ సంబంధాలు లేవట. అదే విధంగా అక్కడి నిర్వాహకులతో సంప్రదించకుండా వారిని కలుపుకుపోకుండా, చెన్నై నుంచి కొందరిని వెంటేసుకుని ప్రచారం చేసుకుంటున్నారట. ఈ అసంతృప్తే సెంథిల్‌కుమార్, కరుణాకరరాజులు వైదొలగడానికి ప్రధాన కారణం.

పొగ తాగడం మానేయండి
రాష్ట్ర పొగ నియంత్రణ కమిటీ అధికారులు మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌కు ఒక లేఖ రాశారు. అందులో ఆ కమిటీ అధికారి సిరిల్‌ అలెగ్జెండర్‌ పేర్కొంటూ తమ కమిటీ సభ్యులు పొగ నియంత్రణలో తీవ్రంగా పని చేస్తున్నారన్నారు. ఇటీవల  పాండిచ్చేరిలో కమల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభను నిర్వహించారన్నారు. ఆ సమయంలో వేదిక వెనుక భాగాన ఒక స్త్రీ సిగరెట్‌ కాల్చడం తమ అధికారుల కంట పడిందన్నారు.

అంతేగాకుండా మీ పార్టీ నిర్వాహకులు, కార్యకర్తలు పలువురు పొగ తాగుతున్న దృశ్యాల వీడియో తమకు అందిందని పేర్కొన్నారు. ఆ ప్రాంతం పొగ తాగే జోన్‌ కాదని, అది జనసంచారం ఉండే ప్రాతం అని వివరించారు. మీరు సినిమాల్లో పొగ తాగే సన్నివేశాలను ఎలా నిషేధించేవారో, అదే విధంగా ప్రస్తుత ప్రచారాల్లోనూ మక్కల్‌ నీది మయ్యం కార్యకర్తలు పొగ తాగడాన్ని కట్టడి చేయాలని కోరారు. ఇక ఇంతకుముందు పొగ తాగిన వారిపై ఎలాంటి చర్చలు తీసుకున్నారో వివరణను తమ కమిటీకి ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు