ఇంటి వద్దకే రేషన్‌

26 Mar, 2019 13:11 IST|Sakshi

ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం

విద్య, వైద్యం, వ్యవసాయం, పేదరిక నిర్మూలనకు పెద్ద పీట

కమల్‌ మేనిఫెస్టో ముఖ్య నేతలకు సీట్లు

సాక్షి, చెన్నై: ఇంటి వద్దకే రేషన్‌ నిత్యవసర వస్తువులు దరి చేరుస్తామన్న హామీతో విశ్వనటుడు కమల్‌ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. విద్య, వైద్యం, సాగు, తాగునీరు, వ్యవసాయం, పేదరిక నిర్మూలనకు పెద్ద పీట వేసే రీతిలో మేనిఫెస్టో ద్వారా హామీలు గుప్పించారు. ఇక, పార్టీలో ముఖ్యులుగా ఉన్న మహేంద్రన్‌కు కోయంబత్తూరు, స్నేహన్‌కు శివగంగై సీటును కట్టబెట్టారు.

విశ్వనటుడు కమల్‌ నేతృత్వంలో మక్కల్‌ నీది మయ్యం పురుడు పోసుకుని ఏడాది అవుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో లోక్‌సభ ఎన్నికలు రావడంతో అదృష్ట్యాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అయ్యారు. లోక్‌సభతో పాటుగా, ఉప ఎన్నికలు జరగనున్న అసెంబ్లీ స్థానాల్లో పోటీకి నిర్ణయించారు. ఇండియ కుడియరసు కట్చి నేత షేకూ తమిళరసన్‌ తనతో జత కట్టడంతో సత్తా చాటుకునేందుకు ఉరకలు తీస్తున్నారు. గత వారం 21 మందితో తొలి జాబితాను ప్రకటించిన కమల్, మరెవరైనా తనతో కలిసి వస్తారా? అన్న ఎదురుచూపుల్లో పడ్డారు. అందుకే మిగిలిన స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. కలిసి వచ్చే వాళ్లు లేని దృష్ట్యా, ఆదివారం రాత్రి కోయంబత్తూరు వేదికగా అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.

ఎన్నికల కమిషన్‌ తమకు కేటాయించిన బ్యాటరీ టార్చ్‌ ద్వారా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతూ, రెండో జాబితాను, ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలను, ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. 18 అసెంబ్లీ ఉప ఎన్నికల స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కమల్, మిగిలిన లోక్‌సభ అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. అయితే, తాను మాత్రం పోటీకి దూరం అని ప్రకటించారు. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం సాగించాల్సి ఉన్న దృష్ట్యా, ఈ సారి ఎన్నికలకు తాను దూరం అని వివరణ ఇచ్చుకున్నారు. ఇక, పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న మహేంద్రన్‌కు కోయంబత్తూరు, కీలక నేతగా ఉన్న స్నేహన్‌కు శివగంగై కట్టబెట్టారు. అలాగే, పొల్లాచ్చిలో యువతుల మీద సాగిన లైంగిక దాడుల్ని వెలుగులోకి తీసుకురావడంలో తీవ్రంగా శ్రమించిన సామాజిక కార్యకర్త మూకాంబికై రత్నంకు పొల్లాచ్చి లోక్‌సభ సీటును అప్పగించారు.

తృణముల్‌తో పొత్తు
లోక్‌సభ ఎన్నికల్లో తృణముల్‌ కాంగ్రెస్‌తో మక్కల్‌ నీది మయ్యం పొత్తు అని ఆ పార్టీ నేత కమల్‌ ప్రకటించారు. సోమవారం పశ్చిమ బెంగాళ్‌ సీఎం, తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీతో కమల్‌ భేటీ అయ్యారు. గంట పాటుగా ఈ భేటీ సాగింది. లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో తృణముల్‌ కాంగ్రెస్‌తో కలిసి తాము పనిచేస్తున్నామని కమల్‌ ప్రకటించారు. తృణముల్‌తో తమ పొత్తు అని, అండమాన్‌ లోక్‌సభకు  పోటీ చేస్తున్న తృణముల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు లక్ష్యంగా మక్కల్‌ నీది మయ్యం పనిచేస్తుందన్నారు.

మేనిఫెస్టో ముఖ్యాంశాలు

  •       తాగునీరు కొనుగోలుకు స్వస్తి పలికి. ఇంటింటా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం.
  •      దారిద్య్రరేఖకు దిగువ ఉన్న 60 లక్షల కుటుంబాల్లో పేదరికం తొలగించడం. ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడం
  •      మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం కేటాయింపు. సమాన వేతనాలు. ప్రైవేటు సంస్థల్లో  మహిళలకు 25 శాతం ఉద్యోగాలు కేటాయిస్తే ప్రత్యేక రాయితీలు.
  •      గుడిసెల రహితంగా తమిళనాడు లక్ష్యం
  •      వ్యవసాయంకు పెద్ద పీట, మహిళా రైతులకు ప్రోత్సాహకాలు. ఆర్థికంగా బలోపేతం. పండించిన పంటలకు గిట్టుబాటు ధర
  •      రాష్ట్ర గవర్నర్‌ను అసెంబ్లీకి ఎన్నికైన సభ్యుల ద్వారానే ఎన్నుకోవడం
  •      హైకోర్టులో తమిళం అధికారిక భాషగా తీసుకొస్తాం
  •      రేషన్‌ షాపులకు ఇక వెళ్లాల్సిన పని లేదు. నేరుగా ఇళ్ల వద్దకే నిత్యవసర వస్తువుల్ని దరి చేరుస్తాం.
  •      దేశంలో సుప్రీంకోర్టు శాఖలు ఆరు డివిజన్లలో ఏర్పాటు. బలమైన సంస్థగా లోకా యుక్తా రూపకల్పన గతంలో అమలు చేసి, ప్రస్తుతం పాలకులు మరిచిన సమత్తువ పురం ఏర్పాటు, గ్రీన్‌ హౌస్‌ల నిర్మాణం వేగవంతం. విద్య, వైద్య రంగానికి పెద్ద పీట వేయడంతో పాటుగా ప్రజల్లో ఆర్థిక ప్రగతి లక్ష్యంగా ముందుకు సాగుతామ న్నహామీలను కమల్‌ గుప్పించారు.
మరిన్ని వార్తలు