కమల్‌ పార్టీకి గుర్తు కేటాయించిన ఈసీ

10 Mar, 2019 10:53 IST|Sakshi

చెన్నై: ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) పార్టీకి ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఎంఎన్‌ఎంకు ‘బ్యాటరీ టార్చ్‌’ గుర్తును కేటాయిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా కమల్‌ హాసన్‌ అభిమానులతో, కార్యకర్తలతో పంచుకున్నారు. ఎంఎన్‌ఎంకు బ్యాటరీ టార్చ్‌ గుర్తు కేటాయించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తమిళనాడులో, దేశ రాజకీయాల్లో కొత్త యుగానికి ఎంఎన్‌ఎం ‘టార్చ్‌ బేరర్‌’గా నిలువబోతుందని పేర్కొన్నారు.

కాగా, రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కమల్‌ హాసన్‌ ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. బీజేపీ, అన్నాడీఎంకేలతో తొలి నుంచి విబేధిస్తూ వస్తున్న కమల్‌ కాంగ్రెస్‌ దిశగా అడుగులు వేశారు. కమల్‌తో జత కలిసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం సైతం సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు అళగిరి.. కమల్‌తో చర్చలు జరిపారు. అయితే  ఇటీవల కాంగ్రెస్‌, డీఎంకేలు కూటమిగా బరిలో దిగనున్నట్టు ప్రకటించాయి. అందులోని డీఎంకేతో కమల్‌కు పొసగకపోవడంతో ఆ కూటమిలో చేరే అవకాశం లేకుండాపోయింది. 

మరిన్ని వార్తలు