రజనీ–కమల్‌ రహస్య భేటీ

23 Feb, 2018 02:07 IST|Sakshi
రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌

పార్టీ పెట్టకముందే కలిశానన్న కమల్‌ హాసన్‌  

చెన్నై: రాజకీయ అరంగేట్రానికి ముందు తాను సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో రహస్యంగా సమావేశమైనట్లు మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌ హాసన్‌ తెలిపారు. ఈ భేటీలో తన రాజకీయ ప్రవేశంపై రజనీతో చర్చించినట్లు పేర్కొన్నారు. తమిళ వారపత్రిక ‘ఆనంద వికటన్‌’కు రాసిన వ్యాసంలో కమల్‌ ఈ వివరాలను వెల్లడించారు. అయితే ఈ భేటీ ఎప్పుడు జరిగిందన్న దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. చెన్నై సమీపంలో పూనామాళ్లిలోని ఓ స్టూడియోలో బిగ్‌బాస్‌ షూటింగ్‌ జరుగుతుండగా, అక్కడికి సమీపంలోనే రజనీ ‘కాలా’ చిత్రం షూటింగ్‌ కూడా జరుగుతుండేదన్నారు.

మనం రహస్యంగా కలుసుకోవచ్చా? అని రజనీకి తాను ప్రతిపాదించినట్లు కమల్‌ తెలిపారు. దీంతో తామిద్దరం ఓ కారులో రహస్యంగా సమావేశమయ్యామని వెల్లడించారు. ఈ సందర్భంగా రాజకీయ అరంగేట్రంపై తన నిర్ణయాలను రజనీకి వివరించినట్లు పేర్కొన్నారు. తొలుత రాజకీయ ప్రవేశంపై తన అభిప్రాయాన్ని విన్న రజనీ ఆశ్చర్యపోయారన్నారు. దీనికోసం కొన్నేళ్ల క్రితమే మానసికంగా సిద్ధమైపోయాననీ, ప్రస్తుతం ఆచరణలో పెడుతున్నానని రజనీకి సమాధానమిచ్చినట్లు కమల్‌ వ్యాసంలో తెలిపారు.

భవిష్యత్‌లో ఇద్దరి రాజకీయ సిద్ధాంతాలు, మార్గాలు వేరైనా పరస్పరం గౌరవించుకోవాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న కాషాయీకరణ రాజకీయాలను వ్యతిరేకిస్తున్నట్లు ఆ వ్యాసంలో కమల్‌ మరోసారి స్పష్టం చేశారు. ‘కాషాయాన్ని కమల్‌ కించపరుస్తున్నాడని కొందరంటున్నారు. అది ఎంత మాత్రం నిజం కాదు. త్యాగానికి ప్రతీకైన కాషాయానికి అత్యంత గౌరవముంది. అంతకంటే ముఖ్యంగా జాతీయ జెండాలోనూ కాషాయానికి చోటుంది’ అని కమల్‌ చెప్పారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు