ప్రజాతీర్పుపై స్పందించిన కమల్‌

24 May, 2019 16:32 IST|Sakshi

చెన్నై: హీరో కమల్‌ హాసన్‌ స్థాపించిన మక్కల్‌ నీది మయ్యం పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది. తమిళనాడు, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కమల్‌ బొక్క బోర్లా పడ్డారు. ఆ పార్టీని ప్రజలు తిస్కరించారు. అయితే పార్టీ ఘోర పరాజయంపై కమల్‌ పెదవి విప్పారు. శుక్రవారం చెన్నైలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీకి ఓటు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రెండో సారి కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీకి శుభాకాంక్షలు తెలిపారు.

తమిళనాడు దేశంలో ఓ భాగమే.. గుర్తించండి
‘పార్టీని స్థాపించిన 14 నెలల్లో పోరాడి ఈ స్థాయికి వెళ్లగలగటం మాకు బలాన్నిచ్చింది. ఇప్పుడు ఓడిపోవచ్చు.. కానీ భవిష్యత్‌లో గెలుస్తాం. బీజేపీ పాలిత ప్రాంతాల్లోగా బీజేపేతర ప్రాంతాల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ పాటు పడాలి. మీరు విజయం సాధించిన రాష్ట్రాలతో పాటు తమిళనాడుకు ప్రాధాన్యత ఇవ్వాలి. తమిళనాడు కూడా దేశంలో ఒక రాష్ట్రమే అని గుర్తించాలి. అన్ని రాష్ట్రాలపై ప్రేమను సమానంగానే పంచాలి. ఓటమిపై సమీక్షించుకుని, భవిష్యత్‌లో ప్రజల పక్షాన ప్రతి పోరాటానికి ముందుంటాను’అని కమల్‌ పేర్కొన్నారు.

నిరాశలో కమల్‌ ఫ్యాన్స్‌
ఫిబ్రవరి 21న ‘మక్కల్ నీది మయ్యమ్’  పార్టీని కమల్‌ స్థాపించారు. దక్షిణాదిలో ఆరు రాష్ట్రాలకు గుర్తుగా ఆరు చేతులతో పార్టీ జెండాను తయారుచేసారు.అంతేకాదు ఈ ఎన్నికల్లో తమిళనాడులో దాదాపు అన్ని స్థానాల్లో తన పార్టీ తరుపున అభ్యర్థులను నిలబెట్టారు. ఎన్నికల సంఘం కమల్ పార్టీకి టార్చిలైట్ గుర్తును కేటాయించింది. కానీ ఈ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. కమల్ హాసన్ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’ ఒక్క స్థానంలో కూడా గెలవకపోవడమే కాకుండా అసలు ప్రభావమే చూపించలేక పోవడాన్ని కమల్ హాసన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

మరిన్ని వార్తలు