గవర్నర్‌ను కలిసిన కమల్‌ నాధ్‌

12 Dec, 2018 13:17 IST|Sakshi

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ ముందుకొచ్చింది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు లభించడంతో మేజిక్‌ ఫిగర్‌ను సాధించిన కాంగ్రెస్‌ తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్‌ను కలిసింది. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మధ్యప్రదేశ్‌ సీఎం రేస్‌లో నిలిచిన కమల్‌ నాథ్‌ బుధవారం మధ్యాహ్నం గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ను కలిశారు. కమల్‌ నాథ్‌తో పాటు సీఎం పదవి ఆశిస్తున్న పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌, జ్యోతిరాదిత్య సింధియా రాజ్‌భవన్‌కు వెళ్లిన నేతల బృందంలో ఉన్నారు.తమకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాను వారు గవర్నర్‌కు అందచేశారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యాబలం తమకుందని కమల్‌ నాథ్‌ గవర్నర్‌కు వివరించారు.  మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్ధానాలుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్‌ ఫిగర్‌ 116 స్ధానాలు కాగా కాంగ్రెస్‌ 114 స్ధానాల వద్దే నిలిచింది. దీంతో బీఎస్పీ నుంచి గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేల తోడ్పాటు కాంగ్రెస్‌కు లభించనుంది. మరోవైపు గెలుపొందిన స్వతంత్రులతో కూడా కాంగ్రెస్‌ మంతనాలు ప్రారంభించింది.

మరిన్ని వార్తలు