పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధమే : కమల్‌నాథ్‌

28 Jun, 2019 17:29 IST|Sakshi

భోపాల్‌ : రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడానికి మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ముందుకొచ్చారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కమల్‌నాథ్‌ వెల్లడించారు. గురువారం భోపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ ఓటమికి నేను పూర్తి భాధ్యత వహిస్తున్నాను. రాహుల్‌ గాంధీ నిర్ణయం సరైందే. ఎంపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాన’ని తెలిపారు.

పార్టీలో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు ఎవరూ కూడా లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహించకపోవడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతిత తెలిసిందే. అంతేకాకుండా అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కమల్‌నాథ్‌ కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని 29 లోక్‌సభ స్థానాలకు గానూ కాంగ్రెస్‌ ఒక స్థానంలో విజయం సాధించింది. 

కాగా, కాంగ్రెస్‌ అధిష్టానం 2018 ఏప్రిల్‌లో కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అద్యక్షునిగా నియమించింది. అయితే గతేడాది డిసెంబర్‌లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన ఎంపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి ముందుకొచ్చారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం కమల్‌నాథ్‌ను ఆ పదవిలో కొనసాగాలని కోరింది.

మరిన్ని వార్తలు