‘మా ఎమ్మెల్యేలు అమ్ముడుపోరు’

24 Jul, 2019 14:37 IST|Sakshi

భోపాల్‌ : కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ సర్కార్‌ కూలిన నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో సీఎం కమల్‌ నాథ్‌ విపక్ష నేత గోపాల్‌ భార్గవ్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బుధవారం మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో కమల్‌ నాథ్‌ మాట్లాడుతూ తన ప్రభుత్వం పూర్తిగా ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతుందని చెప్పారు. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని తేల్చిచెప్పారు. మధ్యప్రదేశ్‌ అభివృద్ధికి పాటుపడుతూ ఐదేళ్ల పదవీకాలాన్ని తమ ప్రభుత్వం పూర్తిచేస్తుందని పేర్కొన్నారు. సీఎం ప్రసంగానికి బీజేపీ నేత గోపాల్‌ భార్గవ అడ్డు తగులుతూ నెంబర్‌ వన్‌, నెంబర్‌ టూ నుంచి ఉత్తర్వులు వస్తే ఈ ప్రభుత్వం ఒక్క రోజు కూడా అధికారంలో ఉండదని అన్నారు.

విపక్ష నేత వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపిన ముఖ్యమంత్రి దమ్ముంటే తమ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని సవాల్‌ విసిరారు. కాగా మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో లుకలుకలున్నాయని మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలిన నేపథ్యంలో చౌహాన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మరిన్ని వార్తలు