కమల్‌ వర్సెస్‌ కమలం

1 Nov, 2018 03:16 IST|Sakshi

మూడుసార్లు సీఎం శివరాజ్‌  x వ్యూహకర్త కమల్‌నాథ్‌ 

సంక్షేమ కార్యక్రమాలతో నిరుపేదలపై చెరగని ముద్ర వేసి మామా అంటూ ప్రజలతో ఆప్యాయంగా పిలిపించుకునే కమలనాథుడు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఒకవైపు, ఇందిరాగాంధీకి కుడి భుజంగా పేరుతెచ్చుకొని  సుదీర్ఘ రాజకీయ అనుభవంతో కాంగ్రెస్‌ పార్టీని నడిపిస్తున్న కమల్‌నాథ్‌ మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌ ప్రజల మనసు దోచుకునే ‘నాథు’డెవరు? పేదల ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్న శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను ధనిక పార్లమెంటేరియన్‌ కమల్‌నాథ్‌ ఢీ కొనగలరా? 

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్‌ అత్యంత కీలకం. 29 లోక్‌సభ స్థానాలున్న మధ్యప్రదేశ్‌పై పట్టు సంపాదించడం కాంగ్రెస్, బీజేపీలకు అత్యంత ఆవశ్యకం. అంతకుముందు అంధకారంలో ఉన్న రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన నేత చౌహానే. సంక్షేమ పథకాలతోనే ఆయన తిరుగులేని నేతగా ఎదిగారు. అయితే 13ఏళ్లు సీఎంగా ఉండటం, వ్యాపమ్‌ సహా వివిధ కుంభకోణాలు, రైతు సమస్యలు, విద్య, ఆరోగ్య రంగాల్లో ఇతరులతో పోలిస్తే వెనకబడడం వంటికి చౌహాన్‌కు ఈ ఎన్నికల్లో సవాల్‌గా మారాయి. రాష్ట్రంలో ఇంకా 70% మంది ప్రజల ఆదాయ వనరు వ్యవసాయమే. నెలవారీ రూ.1300 తలసరి ఆదాయంతో వీరి పరిస్థితి దారుణంగా ఉంది. జాతీయ సగటుకంటే ఇది 7% తక్కువ. గతేడాది మందసౌర్‌లో రైతుల ఆందోళనలు, పోలీసుల కాల్పులు, ఆరుగురు రైతులు చనిపోవడం శివ్‌రాజ్‌ మెడకు చుట్టుకున్నాయి. ఇన్ని సమస్యల మధ్య చౌహాన్‌ సంక్షేమ కార్యక్రమాలు, హిందుత్వ కార్డు, మోదీ ఇమేజ్‌ను నమ్ముకొని ఎన్నికల బరిలో దిగారు. అయితే.. ఇప్పటికీ  46% మంది చౌహాన్‌ సీఎంగా కావాలని కోరుకుంటున్నారు. 

శివరాజ్‌ వ్యూహాలు  
రైతు సమస్యలు, నిరుద్యోగమే ఎన్నికల్లో ప్రభావం చూపించనున్నాయి. వీటినుంచి బయటపడేందుకు చౌహాన్‌ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. జనాశీర్వాద్‌ యాత్ర, జనాదేశ్‌ యాత్రల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. రైతులకోసం తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకొస్తున్నారు. గత ఏడాదిలో రూ.32,701 కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారు. రాష్ట్రంలో 90% హిందువులే ఉండడంతో.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే గో సంరక్షణకు ఏకంగా ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేస్తామంటున్నారు. 

మామ ఇమేజ్‌  
శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ది రైతు కుటుంబం. విద్యార్థి దశలోనే ఆరెస్సెస్‌తో అనుంబధం ఏర్పడింది. ఏబీవీపీలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. 1990లో తొలిసారిగా మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎంపీగా నాలుగు సార్లు వరసగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2003లో రాష్ట్ర సీఎంగా పగ్గాలు చేపట్టారు. అప్పట్లో ఆయనపై పప్పు అనే ముద్ర ఉండేది. కానీ తనకున్న నాయకత్వ పటిమ, పాలనా సామర్థ్యాలతో ఆ ఇమేజ్‌ను చెరిపేసుకుని అందరితో మామ అని పిలిపించుకునే స్థితికి ఎదిగారు. 2008 ఎన్నికల్లో చౌహాన్‌ 143 స్థానాల్లో, 2013లో 165 చోట్ల పార్టీని గెలిపించుకున్నారు.

కమల్‌నాథ్‌  ప్లానింగ్‌..
మధ్యప్రదేశ్‌లో పదిహేనేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ ఎన్నికల వేళ పీసీసీ అధ్యక్ష పగ్గాలను సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కమల్‌నాథ్‌కు అప్పగించింది. కమల్‌నాథ్‌ రాజకీయాల్లో తిరుగులేని వ్యూహకర్త. పారిశ్రామిక, ఆర్థిక రంగాలపై మంచి పట్టు ఉంది. తొమ్మిదిసార్లు మధ్యప్రదేశ్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికైన కమల్‌నాథ్‌కు రాష్ట్రంలో ప్రతి నాయకుడి పాజిటివ్, నెగటివ్‌ అంశాలు బాగా తెలుసు. నాయకులతోపాటు, కార్యకర్తలతోనూ మంచి అనుబంధం ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా కమల్‌నాథ్‌ను ఎంపిక చేయడంపై కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. చౌహాన్‌ ‘మామ’ ఇమేజ్‌ మసకబారేలా, ప్రజల్లో ఆయన విశ్వసనీయత దెబ్బ తీసేలా కుంభకోణాలపైనే దృష్టి సారించారు. హిందూత్వ కార్డునీ ప్రయోగిస్తున్నారు. ‘మేము కూడా మతాన్ని గౌరవిస్తాం. మతాన్ని రాజకీయాల్లోకి వాడుకోం. చింద్వారాలో 101 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. కానీ దానిని ప్రచారం చేసుకోలేదు’ అంటూ పదే పదే చెబుతున్నారు. 

రాజకీయ ప్రస్థానం 
కమల్‌నాథ్‌ సంజయ్‌గాంధీకి సమకాలికుడు. ఇందిర నుంచి రాహుల్‌ వరకు మూడు తరాల గాంధీ కుటుంబానికి సన్నిహితుడు. 1980 నుంచి చింద్వారా లోక్‌ సభ స్థానానికి తొమ్మిది సార్లు గెలిచారు. 16వ లోక్‌సభలో కమలనాథే  సీనియర్‌ సభ్యుడు. కమల్‌నాథ్‌కు ఏవియేషన్‌ రంగంలో వ్యాపారాలతో పాటు ఎన్నో రెస్టారెంట్లకు అధినేత.  187 కోట్ల ఆస్తి ఉందని అఫిడవిట్‌లో ప్రకటించుకున్నారు.    
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విశ్వాసపరీక్షలో ‘యెడ్డీ’ విజయం

క్షమాపణ చెప్పిన ఆజంఖాన్‌

ఎన్‌ఎంసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కాపులపై చంద్రబాబుది మోసపూరిత వైఖరే

‘సీఎం వైఎస్‌ జగన్‌పై దుష్ప్రచారం’

‘ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లు ఫ్రీగా ఇవ్వాలి’

జలగలు రక్తం పీల్చినట్టు.. ఫీజుల్ని దండుకుంటున్నారు

‘వంద కోట్లకు పైగా తగలేశారు’

చట్టవ్యతిరేక పనులను సహించం

రమేశ్‌ భేష్‌; సిద్దు మెచ్చుకోలు

ప్రజావేదికను టీడీపీ మరిచిపోతే మంచిది : మంత్రి అవంతి

ఈ బడ్జెట్‌తో మళ్లీ రాజన్న రాజ్యం: రోజా

‘ఎన్నికల బాండు’ల్లో కొత్త కోణం

సీఎం జగన్‌తో పార్టీ కాపు నేతలు భేటీ

ఉన్నావ్‌ ప్రమాదం: ప్రియాంక ప్రశ్నల వర్షం

మహిళా ఎమ్మెల్యేకు చేదు అనుభవం; పేడతో శుద్ధి!

కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా

జగన్‌ మొదటి బడ్జెట్‌.. మనసున్న బడ్జెట్‌

కర్ణాటక స్పీకర్‌ రాజీనామా

ఇసుక.. టీడీపీ నేతల పొట్టల్లో ఉంది

విశ్వాస పరీక్షలో నెగ్గిన యడ్డీ సర్కార్‌

కొద్ది రోజులాగు చిట్టి నాయుడూ..! 

వారికి ఏ కులం సర్టిఫికెట్‌ ఇవ్వడం లేదు

ఆంగ్లం మాట్లాడే కొద్దిమందిలో ఒకరు...

మాజీ ఎంపీ వివేక్‌ పార్టీ మార్పుపై కొత్త ట్విస్ట్‌!

ఇజ్రాయెల్‌ ఎన్నికల్లో ‘మోదీ’ ప్రచారం 

కర్ణాటకం : యడ్డీకి చెక్‌ ఎలా..?

అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం : మంత్రి బుగ్గన

జాతకం తారుమారు అయ్యిందా? 

ప్రభాకరా.. అభివృద్ధిపై ఆత్మవిమర్శ చేసుకో

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాజల్‌.. సవాల్‌

అఖిల్‌ సరసన?

తగ్గుతూ.. పెరుగుతూ...

సంపూ రికార్డ్‌

వాలి స్ఫూర్తితో...

కాలేజీకి చేసినదే సినిమాకి చేశాను