కనిగిరి టీ'ఢీ'పీ

2 Jul, 2018 13:19 IST|Sakshi
శనివారం నిర్వహించిన నగర పంచాయతీ సమావేశంలో కౌన్సిలర్, కో ఆప్షన్‌ సభ్యుడి వాదులాట

అవినీతి, అక్రమార్జన కోసం నిత్యం రగడ

నాయకులు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు  

వీధి కెక్కిన టీడీపీ అంతర్గత పోరు

ప్రజాప్రతినిధుల తీరుపై ప్రజల మండిపాటు

కనిగిరి: నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అంతర్గత పోరు వీధికెక్కింది. తెరవెనుక అసలు రాజకీయం ఏంటనేది పక్కన పెడితే నేతలకు ఒకరంటే ఒకరికి పొసగడం లేదని స్పష్టమవుతోంది. అవినీతి, అక్రమ సంపాదన, వాటాల్లో విభేదాలు, అక్రమార్గాలు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. వారి వారి అవసరాలకు అనుగుణంగా..మున్సిపల్‌ సమావేశాన్ని అడ్డాగా చేసుకుని అధికార పార్టీ కౌన్సిలర్లు కుమ్ములాడుకోవడం పరిపాటి. వారి స్వార్థ ప్రయోజనాలు, రాజకీయాలతో ఇష్టానురీతిగా సమావేశాలు వాయిదా వేయడం, వర్కులు రద్దు చేయడం పరిపాటి. ఫలితంగా వివిధ గ్రాంట్లకు సంబంధించి సుమారు రూ.5 కోట్ల పనులకు నాలుగు సమావేశాలుగా ఆమోదాలు జరక్క..నిలిచాయి. తాజాగా గత నెల 29న మరో రూ.5.20 కోట్ల సబ్‌ప్లాన్‌ నిధులు మంజూరయ్యాయి. మొదటి విడత పనులకే నేటికీ శ్రీకారం చుట్టకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది.    

పోరుకు అడ్డాగా మున్సిపల్‌ సమావేశం
ప్రతి సమావేశంలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లే స్వపక్షంలో విపక్షంలా..వీధికెక్కుతున్నారు. ఓ సమావేశంలో చైర్మన్‌ టార్గెట్‌గా..కమిషనర్‌ టార్గెట్‌గా, ఇంకో సమావేశంలో అధికారులు టార్గెట్‌గా..మరోసారి అధికార పార్టీ కౌన్సిలర్ల గ్రూపుల ఆధిపత్య పోరుతో ఇలా ప్రతి మీటింగ్‌లో అధికార పార్టీ కౌన్సిలర్లు సమావేశాన్ని రభస చేస్తుంటారు. వీరంతా ఏదో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ..గోడవ పడుతున్నారనుకుంటే పొరపాటే. కోట్ల జల దోపిడీ వాటాల్లో పంపకాల్లో తేడాలు, కోట్ల రూపాయల అభివృద్ధి పనుల్లో పర్సంటేజీలు, వర్కుల పంపకాల్లో తేడాలు..అక్రమమార్గ పనుల అనుమతుల్లో కుదరని పొంతనలు, నేతల మధ్య ఆధిపత్య పోరు ఇలా ప్రతి వివాదం వెనుక తెరవెనుక అసలు రాజకీయం వేరేది నడుస్తోంది. బయటకు మాత్రం సమావేశాల్లో అవినీతి, అక్రమాలు, పనుల్లో నాణ్యత లోపాలు.. అధికారుల అవినీతి మితిమీరింది. టీడీపీకి, ఎమ్మెల్యేకు చెడ్డపేరు తెస్తున్నారంటూ..బీరాలు పలుకుతుంటారు.

గతేడాదిగా నగర పంచాయతీ సమావేశాల్లో జరుగుతున్న పోరు తీరును పరిశీలిస్తే చైర్మన్, వైస్‌ చైర్మన్‌ల ఆధిపత్య గొడవ జరగ్గా..మరోసారి వైస్‌ చైర్మన్‌..కొందరు కౌన్సిలర్ల మధ్య అంతర్గత వైర్యంతో రభస జరిగింది. ఇంకో సమావేశంలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు వర్కుల పంపకాల్లో రెండు గ్రూపులుగా విడిపోయి రచ్చ..రచ్చ చేశారు. మరో సమావేశంలో తమ అధికార పార్టీలోని మరో వర్గం ప్రజాప్రతినిధులు అనుకూలురు వారికి పనులు ఎందుకు ఇవ్వలేదంటూ వర్కులు రద్దు చేశారు..ఇలా అనేకం. ఇటీవల సుమారు 5 కోట్ల రూపాయలకు చెందిన 14వ ఆర్థిక సంఘ నిధుల పనులు, ఎస్‌ఎఫ్‌సీ, ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులకు చెందిన సుమారు 60 పనులు మూడు సమావేశాలుగా రద్దు జరగ్గా.. రెండు సమావేశాలు వాయిదా పడ్డాయి.

తాజా వివాదంలో అసలు కథ ఇదేనా..
తాజాగా శనివారం జరిగిన మున్సిపల్‌ సమావేశంలో జరిగిన కుర్చిల కుమ్ములాటలో కూడా తెర వెనుక అసలు కథ టపాసుల గోడౌన్‌కు అనుమతి ఇవ్వకపోవడమే కారణం అనేది బహిరంగ చర్చ. గత సమావేశం కూడా కేవలం అదే విషయంపై టీపీఓ, కమిషనర్‌ టార్గెట్‌గా సమావేశం వాయిదా వేశారని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్తున్నారు.

అవినీతిపై విమర్శల హోరు
సమావేశంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మధ్య జరిగిన మాటల తూటాల విమర్శనాస్త్రలపై పట్టణంలో జోరుగా చర్చ సాగుతోంది. ఊళ్లు పంచుకుంటున్నట్లు నగర పంచాయతీని అధికార పార్టీ నేతలు భ్రష్టు పట్టిస్తున్నారంటూ ప్రజలు ఈసడించుకుంటున్నారు. ఓ వైపు పట్టణ ముఖ్య ప్రజాప్రతినిధి అవినీతి.. చేతకాని పాలనపై..మరో వైపు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అక్రమార్జన, అంతర్గత పోరుపై విమర్శలు హోరు సాగుతోంది. పట్టణంలో ప్రజలు దాహం కేకలు పెడుతున్నారు. రోజూ ఏదో కాలనీకి చెందిన వారు మున్సిపల్‌ ఆఫీసు వద్ద నిరసన తెలుపుతున్నారు. కనీస అభివృద్ధిని విస్మరించి వారి స్వార్థ ప్రయోజనాలు, అక్రమ సంపాదన కోసం నిత్యం గోడవలతో వీధికెక్కే వీరినా..! తాము ప్రజాప్రతినిధులగా ఎన్నుకుందంటూ పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు