అమరావతి ఉద్యమం ఏపాటిదో అందరికీ తెలుసు

5 Jul, 2020 03:55 IST|Sakshi

29 గ్రామాల్లో మొదలై.. మూడు గ్రామాలకు..  ఫొటోలకే పరిమితమైంది..  

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు 

సాక్షి, అమరావతి: ‘అమరావతి ఉద్యమం ఏపాటిదో.. ఉద్యమ వాస్తవ పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు. అనుకూల మీడియా ఉంది కదా అని 200 రోజుల ఉద్యమం పేరిట రాష్ట్ర ప్రజల మనోభావాలు మారిపోయేలా ప్రచారం చేయాలనుకోవడం చంద్రబాబు అవివేకమే’ అని వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబూ.. వాస్తవాలకు రండి. 200 రోజుల నుంచి రెప్పవాల్చని పోరు జరిగిందని రకరకాల కథనాలొచ్చాయి. దాని ఉధృతి ఏంటన్నది అమరావతి ప్రాంతంలో ఉండి చూõసే వాళ్లకు తెలుస్తుంది. అమెరికాలోనో, అనకాపల్లిలోనో ఉండి చూస్తే కనిపించదు. 29 గ్రామాల్లో మొదలైన ఉద్యమం ఇప్పుడు మూడు గ్రామాల్లో కొన్ని ఇళ్లకు.. ఫొటోలకు పరిమితమైందని మేం మాట్లాడితే బహుశా కొన్ని విమర్శలు రావచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘వాస్తవిక ధృక్పథంతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వికేంద్రీకరణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కొద్దిమందిలో బాధ ఉంటే ఉండొచ్చు గానీ.. ఎక్కువ బాధ పడింది చంద్రబాబే. రాజధాని పేరుతో జరుగుతున్న ఉద్యమానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చంద్రబాబే’ అని అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

రాష్ట్ర విభజన వేళ కూడా బాబు ఇంతగా బాధపడలేదు
► ఉద్యమం చేసే వారిని కించపరచాలని నేను అనుకోవడం లేదు. కేవలం చంద్రబాబు కోసమో, ఆయన మద్దతుదారుల కోసమే జరుగుతున్న ఉద్యమ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో ఒక్కసారి అలోచించండి. 
► రాష్ట్ర విభజన వేళలో కూడా చంద్రబాబు ఇంతగా బాధపడలేదు. అప్పట్లో రాష్ట్ర విభజన అంశంలో రెండు కళ్లు, రెండు నాల్కల సిద్ధాంతంతో వ్యవహరించారు.
► ఇప్పుడు అమరావతి ఉండాలని ఆయనే స్వయంగా కుటుంబ సభ్యులతో రోడ్డు మీదకు రావడం వెనుక స్వప్రయోజనాలు దాగి ఉన్నాయని ప్రజలంతా భావిస్తున్నారు
► 2018 నాటికి తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పి చంద్రబాబు ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేదు. 
► రైతులపై కేసులు పెట్టి, బలవంతంగా భూములు లాక్కుని ఎకరాకు బదులుగా రైతులకు ఇస్తానన్న 1,400 గజాల భూమిలో ఒక్క గజమైనా సకాలంలో ఎందుకు ఇవ్వలేకపోయారు. 

ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ గుర్తించలేని నాయకత్వమా!
► అమరావతి డిజైన్లకు చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు పెట్టింది రూ.800 కోట్లు. కానీ, రైతులకు కౌలు రూపంలో రూ.800 కోట్లు కూడా ఇవ్వలేదు. దీంట్లోనే చంద్రబాబు ఉద్దేశం ఏంటో తెలియడం లేదా.
► విశాఖలో పరిపాలన రాజధాని రావడాన్ని చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ గుర్తించలేని నాయకత్వమా మీది. రాయలసీమకు జ్యుడీషియల్‌ క్యాపిటల్‌ వస్తుంటే.. అక్కడ పుట్టిన వాడిగా అడ్డుపడతారా.

ఉద్యమాలు చేస్తే.. విచారణలు ఆగవు..
► ఉద్యమాలు చేసినా.. అమరావతిలో చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలపై విచారణలు ఆగవు. 
► కొందరి స్వప్రయోజనాల కోసం చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలు ఈ ఉద్యమం మాటున పోతాయని అనుకుంటే పొరపాటు
► ఉద్యమాలను గౌరవిస్తాం. చంద్రబాబు సృష్టించే ఈ కృత్రిమ ఆవేశాలను ప్రజలు గౌరవించరని మేం అర్థం చేసుకున్నాం. ఈ విషయాన్ని టీడీపీ వాళ్లు అర్థం చేసుకుంటే మంచిది.

మూడుచోట్ల  ‘యాంత్రీకరణ’ శిక్షణ కేంద్రాలు..
► రాష్ట్రంలో కొత్తగా మరో మూడు చోట్ల వ్యవసాయ యాంత్రీకరణ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. 
► శ్రీకాకుళం జిల్లా పాలకొండ, తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట, కర్నూలు జిల్లా తగడవంచలో వీటిని ఏర్పాటు చేయనున్నాం. త్వరలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ మూడింటికీ శంకుస్థాపన చేస్తారు. 

మరిన్ని వార్తలు