ఉత్తరాలు, ట్వీట్లు మానుకొని ముందుకు రండి: కన్నబాబు

1 Apr, 2020 13:05 IST|Sakshi

సాక్షి, కాకినాడ/కాకినాడ రూరల్‌: కోవిడ్‌పై ప్రభుత్వం పోరాటం చేస్తున్న తరుణంలో హైదరాబాద్‌లో కూర్చుని ఉత్తరాలు రాయడం, ట్వీట్లు చేయడం మానుకుని ప్రజలకు అండగా ఉండేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కోరారు. మంగళవారం కాకినాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కోవిడ్‌ కట్టడిపై సీఎం వైఎస్‌ జగన్‌ రోజుకు నాలుగుసార్లు అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహిస్తూ తీసుకోవాల్సిన చర్యలతోపాటు సూచనలిస్తున్నారన్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. బాబు ఈ సమయంలో సీఎంగా ఉండి ఉంటే ఆయన అనుకూల మీడియా ప్రపంచ దేశాలు ఆయనను ఆదర్శంగా తీసుకున్నట్టు ప్రచారం చేసేవన్నారు. 

నేటి నుంచి వంట నూనె ఉత్పత్తి
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిలిచిన ఎడిబుల్‌ ఆయిల్‌ (వంట నూనె) ఉత్పత్తిని కంపెనీలు బుధవారం నుంచి ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌లో ఆయిల్‌ కంపెనీల ప్రతినిధులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వంటనూనె ఉత్పత్తి చేసే కంపెనీలు ప్యాకింగ్‌ మెటీరియల్‌ కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా స్థానికంగా తయారు చేసుకోవాలని, తద్వారా ఉత్పత్తి ధర కూడా తగ్గుతుందన్నారు.

మరిన్ని వార్తలు