తప్పు చేయకపోతే భయమెందుకు చంద్రబాబూ?

15 May, 2018 02:12 IST|Sakshi

అవినీతికి పాల్పడ్డావు కాబట్టే భయం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజం

సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల కాంట్రాక్టుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారు కాబట్టే కేసుల పేరు చెబుతుంటే ఆయన ఉలిక్కిపడుతున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. సోమవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అధ్యక్షతన జరిగిన అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల సమావేశంలో కన్నా పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాటాడుతూ.. ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ద్వారా నిధులిస్తామని కేంద్రం ముందుకొచ్చినా దాన్ని సాధించుకోవడంతో చంద్రబాబు విఫలమయ్యారన్నారు.

రాష్ట్ర విభజన చట్టంలోని హామీల్లో కేంద్రం ఇప్పటికే 85 శాతం అమలు చేసిందని, మిగిలినవి కూడా కేంద్రం అమలు చేస్తుందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వాటి సాధనలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కేంద్రం తనపై కక్ష సాధింపునకు దిగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతుండడం చూస్తుంటే ఆయన ఏదో తప్పు చేశారని స్పష్టమవుతోందన్నారు. కేసుల పేరు చెబితే చంద్రబాబు ఊలిక్కిపడుతున్నారన్నారు. ఏ తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. హోదా కోసం నాలుగేళ్లుగా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేస్తున్న పోరాటాన్ని చూసి చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారన్నారు. 

గాలి కబుర్లు చెబితే నమ్ముతారనుకోవద్దు..
ఏపీలో ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను కన్నా కొట్టిపారేశారు. కేంద్రం నుంచి బయటకొచ్చినప్పటి నుంచి ఆయన కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని విమర్శించారు.  తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకుగానూ అమిత్‌షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌లను కన్నా కలసి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రాష్ట్ర పార్టీలో నెలకొన్న విభేదాలు టీకప్పులో తుపాను లాంటివని, కన్నాను నియమించడం వల్ల అవి సమసిపోతాయని జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. 

మరిన్ని వార్తలు