‘తల్లిదండ్రులను చంపి.. అనాథనయ్యాను అన్న చందంగా..’

23 Feb, 2019 14:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తల్లిదండ్రులను చంపి కోర్టుకు వెళ్లి అనాథనయ్యాను.. మీరే కాపాడాలన్న చందంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుపతి సభలో మాట్లాడారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఇస్తామంటూ రాహుల్ గాంధీ మరోసారి ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఇచ్చేవారైతే.. 2014లో విభజన చట్టంలో ప్రత్యేక హోదాను కాంగ్రెస్ ఎందుకు పొందు పరచలేదని ప్రశ్నించారు. ముంపు ప్రాంతాలను ఏపీలో కలపాలనే ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆఖరి కేబినెట్లో ఎందుకు తిరస్కరించారో చెప్పాలన్నారు.

మాజీ ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన హామీ కంటే ఎక్కువ నిధులను కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇస్తుందని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని స్పష్టంగా చెప్పారని తెలిపారు. టీడీపీ మార్ఫింగ్ చేసిన‌ వీడియోలను చూపించి ప్రజలను మోసం చేస్తోందన్నారు. ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ ఇస్తామని చెప్తే ఎస్పీవీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు