ఆ చేతులను నరకడమే బాబు నైజం

12 Jul, 2018 11:14 IST|Sakshi

బీజేపీ, జనసేన కాళ్లు పట్టుకొని అధికారంలోకి వచ్చారు

కడప స్టీల్‌ ప్లాంట్‌ రావడం బాబుకు ఇష్టం లేదు

ప్రజలను మోసం చేయడమే సీఎం మేనిఫెస్టో : కన్నా లక్ష్మీ నారాయణ

సాక్షి, విశాఖపట్నం : సాయం చేసిన చేతులను నరకడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ మండిపడ్డారు. గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన బాబుపై నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో చంద్రబాబు జనసేన, బీజేపీ కాళ్లు పట్టుకొని అధికారంలోకి వచ్చారని, నాలుగేళ్లు కలిసిఉన్న అనంతరం విమర్శలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. కడప స్టీల్‌ ప్లాంట్‌, దుగరాజపట్నం పోర్టు రావడం చంద్రబాబుకు ఇష్టం లేదని అందుకే వాటి గురించి ఇంకా సమాచారం ఇవ్వలేదని విమర్శించారు. ఉక్కు ఫ్యాక్టరీ అంశాన్ని చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నరని మండిపడ్డారు.

కడప ఉక్కు గురించి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకూ నిర్వాసితుల వివరాలతో పాటు ఇతర సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఫీజబిలిటీ లేదని సెయిల్‌ చెప్పినా, రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కావడంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం అంగీకరించిందన్నారు. టీడీపీ ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడానికి యత్నిస్తోందంటూ ఆయన మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ప్రజలకు చెప్పడానికి కొత్తగా హామీలు లేవని, అన్నీ 2014 ఎన్నికల్లోనే ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కేంద్రంను నిందించడమే మేనిఫెస్టోగా సీఎం పనిచేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో విపరీతమైన అవినితి జరుగుతోందని కన్నా ఆరోపించారు. పోలవరం పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని నిర్వాసిత గిరిజనులు ఆరోపించారని.. తప్పుడు పత్రాలు, రికార్డులు సృష్టించి భూములను లాక్కున్నారని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్‌ను కూడా కేంద్రం ఇస్తుందని దానికి ఇంకా సమయం ఉందని తెలిపారు. ఏపీ అభివృద్ధి ధ్యేయంగా కేంద్రం నిధులు విడుదల చేస్తోందని అన్నారు. కానీ చంద్రబాబు మాత్రం అన్యాయం చేస్తున్నారంటూ బీజేపీ, కేంద్రంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలను ఓటు అడిగే హక్కు కేవలం బీజేపీ కి మాత్రమే ఉందని కన్నా అన్నారు.

మరిన్ని వార్తలు