రాజధాని ఎక్కడన్నది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం

18 Feb, 2020 04:20 IST|Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ 

సాక్షి, అమరావతి: రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే విచక్షణాధికారంతో తీసుకునే నిర్ణయమని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఇందులో కేంద్రం పాత్ర ఏమీ ఉండదని అయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసే ప్రక్రియలో భాగంగా విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట పార్లమెంటరీæ నియోజకవర్గాల బీజేపీ నేతలతో సోమవారం ఆయన విజయవాడలో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టును శాశ్వతంగా కర్నూలుకు తరలించాలని కోరుతూ ఆరు నెలల క్రితమే తాను కేంద్ర మంత్రికి లేఖ రాసినట్టు తెలిపారు.

హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసినంత మాత్రన అదొక రాజధానిగా అనలేమని వ్యాఖ్యానించారు. సచివాలయం ఎక్కడ ఉంటే అదే రాజధాని అవుతుందన్నారు. రానున్న స్ధానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. పురందేశ్వరి నేతృత్వంలో పార్టీ కమిటీ ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై అభిప్రాయాలను సేకరిస్తుందన్నారు. పోలీసుల అక్రమ కేసులకు నిరసనగా 19న కడపలో ధర్నా చేపట్టాలని నిర్ణయించామన్నారు. టీడీపీ హయాంలో చోటుచేసుకున్న పోలవరం నిర్మాణంలో అవినీతి, విశాఖ భూకుంభకోణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా స్పందన లేదన్నారు.

మరిన్ని వార్తలు