నీ దేశద్రోహ చర్యలు సిగ్గుచేటు

16 Nov, 2018 19:00 IST|Sakshi

చంద్రబాబుపై కన్నా లక్ష్మీనారాయణ ధ్వజం

సాక్షి, గుంటూరు : ఓటుకు నోటు కేసు భయంతో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తనకు ఏదో జరగబోతోందనే ఊహలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. బాబు అండ్ కో రాష్ట్రాన్ని అడ్డంగా దోచేశారని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో సీబీఐ విచారణ జరిగితే తన బండారం బయటపడుతుందని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. ఐటీ అధికారులకు సహకరించం, సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వమని చెబుతుండమే ఇందుకు నిదర్శనమన్నారు. వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.

చక్రం తిప్పుతున్నానని ఫీలవుతున్నారు..
దేశం మొత్తం చక్రంలాగా తిరిగి వచ్చిన చంద్రబాబు తానే చక్రం తిప్పుతున్నట్లు ఫీలవుతున్నారని లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. బాబుకు శాలువాలు కప్పిన వారంతా ఎన్డీఏ వ్యతిరేకులేనని పేర్కొన్నారు. పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వం బ్రోకర్ పనులు చేస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  

నువ్వెందుకు ఉలిక్కిపడుతున్నావ్‌?
చంద్రబాబు చేసిన అక్రమాలు వెలికితీస్తారనే భయంతోనే బరితెగించి దేశ సార్వభౌమాధికారాన్ని, రాజ్యాంగ సంస్థలను ధిక్కరిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణలో ట్విటర్‌లో పేర్కొన్నారు. చంద్రబాబుకు.. అర్బన్‌ నక్సలైట్లు, వేర్పాటువాదులకు తేడా లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీబీఐ తన పని తాను చేస్తుంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నించారు. పోలీసుల తనిఖీని కేవలం దొంగలు, నేరస్తులు మాత్రమే వ్యతిరేకిస్తారని ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా