‘చంద్రబాబు విష బీజాలు నాటుతున్నారు’

16 May, 2018 20:36 IST|Sakshi
కన్నా లక్ష్మీనారాయణ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, విజయవాడ: తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన పడవ ప్రమాదం దురదృష్టకరమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన సాయంత్రమే ప్రమాదం జరగటం సీఎం చంద్రబాబు నాయుడు పనితీరుకు నిదర్శనమని చెప్పారు. బజారులో అక్రమ సంబంధాలు అంటగట్టి 2019లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నాలుగేళ్లలో 85 శాతం పూర్తి చేశామని, మిగతా 15 శాతం హామీలను మాత్రమే అమలు చేయాల్సి ఉందన్నారు. కానీ రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు విష బీజాలు నాటుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. అనంతపురానికి సెంట్రల్ యూనివర్సిటీని కేంద్ర ఆమోదించిందని చెప్పారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ఏం చేయట్లేదని చెప్పడం అన్యాయమన్నారు.

కన్నా లక్ష్మీనారాయణ బుధవారం ఇక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో తరచుగా పడవ ప్రమాదాలు జరుగుతున్నాయని, అలా జరిగినప్పుడల్లా చంద్రబాబు మరోసారి జరగనివ్వనని చెబుతూనే ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటం దురదృష్టకరం.  ప్రభుత్వం వాగ్దానాలు ఇచ్చి, మరిచిపోవడం నిన్న జరిగిన ఘటనే ఉదాహరణగా నిలిచిందన్నారు. ప్రజల ప్రాణాల మీద ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయిందన్నారు. కాగా, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించినందుకు సంతోషంగా ఉన్నాను. నాకు పదవి రావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

అంతకుముందు న్యూఢిల్లీ నుంచి విమానంలో గన్నవరం విమనాశ్రయానికి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ శ్రేణులు స్వాగతం పలికాయి. గన్నవరం నుంచి ర్యాలీగా విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న ఆయన అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు కృష్ణంరాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కావూరి సాంబశివరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.

కన్నాను ప్రశంసించిన సోము వీర్రాజు
ఏపీలో బీజేపీని ముందుకు నడిపించడానికి ఒక శంఖారావాన్ని కన్నా లక్ష్మీ నారాయణ పూర్తి చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కొనియాడారు. దేశంలో పలు రాష్ట్రాలలో బీజేపీ విజయాలతో దూసుకుపోతోంది. ఏపీ తెలంగాణలలో కూడా సత్తా చాటుతాం. ఏపీలో బీజేపీ నిర్మాణం పటిష్టం చేయాలని సంకల్పించామని సోము వీర్రాజు వెల్లడించారు.

మరిన్ని వార్తలు