‘చంద్రబాబును తరిమే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’

23 Feb, 2019 18:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన సహాయాన్ని బయటకు చెప్పకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిత్తులమారి నక్కల వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. శనివారం ఏపీ బీజేపీ నేతలు రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశమయ్యారు. అనంతరం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రెండు దశాబ్దాలుగా ఉన్న విశాఖ రైల్వే జోన్‌ సమస్యను పరిష్కరించాలన్న తమ విజ్ఞప్తిపై మంత్రి గోయల్‌ సానుకూలంగా స్పందించారన్నారు. రైల్వే జోన్‌ అంశాన్ని పరిశీలిస్తామని గోయల్‌ చెప్పారన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులను కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిందన్నారు. కేంద్రం చేసిన మేలును చంద్రబాబు తెలివిగా బయటకు రానివ్వడంలేదని ఆరోపించారు. విభజన చట్టంలోని 90 అంశాలను కేంద్రం పూర్తి చేసిందని తెలిపారు. పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం వందశాతం​ నిధులను ఇస్తుందని చెప్పారు. అన్ని నిధుల్లోనూ చంద్రబాబు కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. చంద్రబాబును ప్రజలు తరిమే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.

హోదాపై రాహుల్‌ మోసం చేస్తున్నారు
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ మరోసారి మోసం చేస్తున్నారని కన్నా ఆరోపించారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంశాన్ని పరిశీలించమని మాత్రమే చట్టంలో ఉందన్నారు. వీరప్ప మొయిలీ అడ్డుకోవడంతోనే హోదా అంశాన్ని చట్టంలో పెట్టలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ది ఉంటే హోదా అంశాన్ని చట్టంలో పెట్టేదన్నారు. నరేంద్ర మోదీ హోదా అంశాన్ని ప్రకటించినట్లుగా వీడియో మార్ఫింగ్‌ చేసి చూపింస్తున్నారని మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా