‘అందుకే చంద్రబాబుపై కేసు వేశా..’

30 Jan, 2019 18:48 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై చంద్రబాబుకు తాను వంద ప్రశ్నలు సంధిస్తే వాటికి సమాధానం కూడా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు అవినీతిని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్‌, మీడియా దృష్టికి తీసుకెళ్లానని.. చివరిగా ఆయన అవినీతిపై హైకోర్టులో కేసు వేసినట్టు వెల్లడించారు. కేంద్రం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తానే చేశానని డబ్బాలు కొట్టుకుంటున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు విహారయాత్ర కేంద్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు సందర్శనకు ప్రజల సొమ్ముతో రైతులను తరలిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ మేకిన్‌ ఇండియాలో భాగంగా కియా మోటార్స్‌ ఆంధ్రప్రదేశ్‌కు రప్పించారని తెలిపారు. కియా మోటార్స్‌ను కేంద్రం ఏపీకి ఇచ్చిందని మంత్రి నారా లోకేశ్‌ స్వయంగా చెప్పారని అన్నారు.

స్థానిక టీడీపీ నేతల అవినీతి వేధింపులు తట్టుకోలేక కియా మోటార్స్‌ వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని.. ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవడంతో పరిస్థితి చక్కబడిందని చెప్పారు. ఎవరిని మోసం చేయడానికి చంద్రబాబు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. నాడు ప్రత్యేక హోదాకు బదులు.. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంది చంద్రబాబు కాదా అని నిలదీశారు. ప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపింది చంద్రబాబేనని గుర్తుచేశారు. 

>
మరిన్ని వార్తలు