‘బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది’

14 Nov, 2018 13:25 IST|Sakshi
కన్నా లక్ష్మీనారాయణ (ఫైల్‌ ఫొటో)

సాక్షి, రాజమండ్రి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూసేకరణ చట్టానికి నీళ్లు వదిలి.. అవసరానికి మించి రైతుల నుంచి అడ్డగోలుగా వేలాది ఎకరాలు సేకరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. బుధవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి, మచిలీపట్నం, కాకినాడ సెజ్‌లకు సంబంధించిన భూసేకరణలో దారుణమైన అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ నెల 19న మచిలీపట్నం నుంచి నిరసన దీక్ష పేరుతో భూసేకరణలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టనున్నట్టు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లతో కలిసి బీజేపీ రాజకీయాలు చేస్తోందంటూ చంద్రబాబు గోబెల్స్‌ ప్రచారం చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపేలా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌పై దుమ్మెత్తిపోసి.. ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకుంది ఎవరని ప్రశ్నించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను అక్రమంగా పార్టీలో చేర్చుకుని పదవులు ఇచ్చిందెవరని నిలదీశారు. అవినీతి పరులపై దాడులు జరుగుతుంటే చంద్రబాబు తనపైనే దాడులు జరిగినట్టు కంగారు పడుతున్నారని తెలిపారు. అవినీతి పాలన వల్లే చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులలో చంద్రబాబు దోచుకున్నారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు