నిబంధనలు పాటించడమే చైర్మన్‌ బాధ్యత: కన్నబాబు

23 Jan, 2020 16:18 IST|Sakshi

అందరూ కలిసి వ్యవస్థను భ్రష్టుపట్టించారు

చైర్మన్‌ను ప్రభావితం చేయడానికే గ్యాలరీలో చంద్రబాబు

అసెంబ్లీలో మంత్రి కన్నబాబు

సాక్షి, అమరావతి : అభివృద్ధిని అడ్డుకోవడమే లక్క్ష్యంగా చేసుకున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు రాష్ట్రంలో ఉండటం ప్రజల దురదృష్టమని మంత్రి కన్నబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రాంతాల అభివృద్ధి గురించి కనీసం ఆలోచన చేయకుండా తాను, తన ఎదుగుదల మాత్రమే ఆయనకు ముఖ్యమని విమర్శించారు. సాంప్రదాయాలను తుంగలో తొక్కడం, ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేయడంలో బాబుని మించిన వ్యక్తి మరొకరు లేరని మండిపడ్డారు. రూల్‌ 71పై గురువారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా కన్నబాబు మాట్లాడారు. అవసరం లేకపోయినా రూల్‌ 71 కోసం రోజంతా మండలిని అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. కనీస నిబంధనలు పాటించకుండా విచక్షణాధికారాన్ని మండలి చైర్మన్‌ ఎలా ఉపయోగిస్తారని మంత్రి ప్రశ్నించారు.

సభలో కన్నబాబు మాట్లాడుతూ.. ‘చైర్మన్‌ను ప్రభావితం చేయడానికే చంద్రబాబు గ్యాలరీలో కూర్చున్నారు. రూల్స్‌ ఒప్పుకోకపోయినా విక్షణాధికారాన్ని ఉపయోగిస్తున్నానని చైర్మన్‌ చెప్పారు. నిబంధనలు పాటించకుండా ఎలా ఉపయోగిస్తారు?. నిబంధనలు పాటించడమే చైర్మన్‌ బాధ్యత. విచక్షణాధికారం ఉందని సభను కూడా రద్దు చేస్తారా?. మండలి లోపల సెల్‌ఫోన్‌తో నారా లోకేష్‌ వీడియోలు తీశారు. ఇది సరైనది కాదు. గ్యాలరీలో చంద్రబాబు, సభలో లోకేష్‌, వీరిద్దరికి తోడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవటంలో సహకరించిన యనమల రామకృష్ణుడు అందరూ కలిసి వ్యవస్థను భ్రష్టుపట్టించారు. (మండలి చైర్మన్‌కు ఆ విచక్షణాధికారం లేదు)

మంత్రులు తాగి వచ్చారని యనమల అంటుంటే.. మరో టీడీపీ బ్రీత్‌ ఎనలైజర్లు పెట్టాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీడియా చర్చల్లో శాసనసభ్యులను కించపరిచే విధంగా మాట్లాడిని వ్యక్తులపై ప్రివిలేజ్‌ మోషన్‌ పెట్టాలి. వంగవీటి రంగా వ్యవహారంలోనే చంద్రబాబు రౌడీయిజాన్ని చూశాం. అమరావతిలో పోటీచేసిన రెండు చోట్లా టీడీపీ ఓడిపోయింది. మంగళగిరిలో లోకేష్‌ కూడా ఓటమిచెందారు. ఇంతకంటే రెఫరెండం ఏం ఉంటుంది. శాసనమండలిని కించపరచడం మా ఉద్దేశం కాదు. పెద్దల సభకు లోకేష్‌ లాంటి సభ్యలు దొడ్డిదాని వస్తుంటారు. చంద్రబాబు  నాయుడు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తానని, కేవలం  29 గ్రామాలకు మాత్రమే పరిమితం అయ్యారు.’ అని అన్నారు.

మరిన్ని వార్తలు