మరోసారి మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు

4 Feb, 2020 12:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలు తరుముకొస్తున్న వేళ దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయం తారాస్థాయికి చేరింది. ఇప్పటివరకు ఇది చేశాం, ఇకముందు అది చేస్తాం అని చెప్పాల్సిన నాయకులు ఇతర పార్టీల నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇక ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో ఎన్నికల కమిషన్‌ చేత మొట్టికాయలు తిన్న బీజేపీ నాయకుడు కపిల్‌ మిశ్రా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మెజారిటీ సీట్లు సాధించడానికి ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ ఇప్పుడు హనుమాన్‌ చాలీసా చదువుతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా ఆమ్‌ఆద్మీపార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓ ఇంటర్వ్యూలో హనుమాన్‌ భక్తుడినని, ఇప్పటికీ హనుమాన్‌ చాలీసా పఠిస్తానని వెల్లడించగా, దీన్ని ఉటంకిస్తూ కపిల్‌ మిశ్రా మంగళవారం ట్వీట్‌ చేశారు. (చదవండి: వివాదాస్పద ట్వీట్‌ చేసిన మిశ్రాకు నోటీసు..)

‘కేజ్రీవాల్‌ హనుమాన్‌ చాలీసా పఠించడం ఎప్పుడో మొదలుపెట్టారు. ఇప్పుడిక ఒవైసీ వంతు. ఆయన కూడా హనుమాన్‌ చాలీసా చదవడం మొదలుపెడతారు. ఐక్యతకు బలమైన శక్తి ఉంది. మన ఐక్యత 20 శాతం ఓటు బ్యాంకు ఉన్నవాళ్లు చేసే మురికి రాజకీయాలను సమాధి చేస్తుంది. దీనికోసం అందరం కలిసి పోరాడుదాం’ అని పిలుపునిచ్చారు. కపిల్‌ మిశ్రా వ్యాఖ్యలపై ఎంఐఎం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గతంలోనూ ఆయన పలుసార్లు అగ్గిరాజేసే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు భారత్‌కు పాక్‌కు మధ్య యుద్ధమని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, రెండు రోజుల పాటు ఢిల్లీ ఎన్నికల ప్రచార నిషేధానికి గురయ్యారు. (బీజేపీ ఇంత దిగజారిపోయిందా?)

చదవండి:

‘మీ పార్టీ పేరును ముస్లిం లీగ్‌గా మార్చుకోండి’

మరిన్ని వార్తలు