చారిత్రాత్మకమా, కాదా కాలమే నిర్ణయిస్తుంది: కపిల్‌ సిబల్‌

5 Aug, 2019 18:50 IST|Sakshi

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కృషి వల్ల కశ్మీర్‌ను సంపాదించుకోగలిగాం. కానీ నేడు దాన్ని శాశ్వతంగా కోల్పోయాం అన్నారు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చర్యతో నేడు నిజంగానే కశ్మీర్‌ను కోల్పోయామన్నారు కపిల్‌ సిబల్‌.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ ఉండటంతో బిల్లు పాస్‌ అయ్యింది. కానీ బిల్లుపై బీజేపీ.. విపక్షాలతో, కశ్మీర్‌ నాయకులతో చర్చించలేదు. కనీసం మాకు సమాచారం కూడా ఇవ్వలేదు. సభలో కూడా బిల్లు గురించి చర్చించడానికి తగిన సమయం ఇవ్వలేదు. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో బిల్లుకు సంబంధించిన చర్చ ప్రారంభించారు. కానీ చర్చకు సిద్ధం కావడానికి ప్రతిపక్షాలకు చాలా తక్కువ సమయం ఇచ్చారు. సంఖ్యా బలం మూలంగానే బీజేపీ ఇలా చేసింది’ అన్నారు కపిల్‌ సిబల్‌.

అంతేకాక ఈ నిర్ణయం చారిత్రాత్మకమో, కాదో కాలమే నిర్ణయిస్తుందన్నారు కపిల్‌ సిబల్‌. చరిత్రలో ఏం జరిగింది.. చట్టంలో ఏం ఉందో మాట్లాడటానికి మనం ఇక్కడ లేమన్నారు కపిల్‌ సిబల్‌. ప్రజాస్వామిక దేశంలో మన పాత్ర ఏంటనే అంశాల గురించి ఈ రోజు మనం పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు కపిల్‌ సిబల్‌.

మరిన్ని వార్తలు