వైఎస్సార్‌ సీపీలో కాపు నాయకుడు

17 Sep, 2018 06:27 IST|Sakshi
కాపు నాయకుడు బండ్రెడ్డి రామజోగికి కండువా వేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

విశాఖపట్నం :వైఎస్సార్‌ సీపీలో ఆనందపురం, మధురవాడ, పద్మనాభం తదితర ప్రాంతాలకు చెందిన నాయకులు ఆదివారం చేరారు.  నగరానికి చెందిన కాపు నాయకుడు బండ్రెడ్డి రామజోగి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో  పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రామజోగి మాట్లాడుతూ కాంగ్రెస్‌లో వివిధ పదవులు నిర్వహించానన్నారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుతో రాష్ట్రం మొత్తం పర్యటించానని తెలిపారు. 1989 నుంచి బిల్డర్‌గా ఉంటూ వైజాగ్‌ బిల్డింగ్‌ అసోసియేషన్‌ చైర్మన్‌గా, కోస్టల్‌ బిల్డింగ్‌ ఫెడరేషన్‌ వైస్‌ చైర్మన్‌గా కూడా పనిచేశానన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాపుల కోసం రూ.10 వేల కోట్ల కేటాయిస్తానని, కాపు కార్పొరేషన్‌ను బలో పేతం చేస్తూ విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తాననడం తనను ఆకట్టుకుందన్నారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలతో ప్రజలు మేలు జరుగుతుందన్నారు.  ఆనందపురం మండలం గండిగుండం మాజీ సర్పంచ్‌ గండ్రెడ్డి శ్రీనివాస్‌ వైఎస్సార్‌ సీపీలో చేరారు. కాంగ్రెస్‌కు చెందిన ఆయన కొంతకాలంగా తటస్థంగా ఉన్నారు. తనతో పాటు గండిగుండంకు చెందిన వెయ్యి మంది పార్టీలో చేరుతున్నట్టు శ్రీనివాస్‌ తెలిపారు. విజయవాడకు చెందిన టీడీపీ మాజీ కార్పొరేటర్‌ బొడ్డు అప్పలనాయుడు పార్టీలో చేరారు. ఈయనది పద్మనాభం మండలం మద్ది. పార్టీ భీమిలి సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, మండల అధ్యక్షుడు కంటుబోతు రాంబాబు ఆధ్వర్యంలో పార్టీలో చేరినట్టు అప్పలనాయుడు తెలిపారు. మధురవాడకు చెందిన టీడీపీ నాయకుడు పోతిన అప్పలరాజు ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు.

మరిన్ని వార్తలు