‘జోలి పట్టి అడుక్కోవడానికి సిగ్గు లేదా?’

13 Jan, 2020 15:51 IST|Sakshi

సాక్షి, కాకినాడ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం బహిరంగ లేఖ రాశారు. అందులో చంద్రబాబు తీరును తప్పుబడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పోలీసు వ్యవస్థను భ్రష్టుపట్టించి నిర్వీర్యం చేయించింది మీరు కాదా?.. బ్రిటీష్ వారి పాలనలో చేయని విధంగా మీ పాలన సాగిందన్న సంగతి గుర్తు లేదా? అని చంద్రబాబును ప్రశ్నించారు. కాపు ఉద్యమ సమయంలో తనను, తన కుటుంబాన్ని దారుణంగా లాఠీలతో కొట్టించి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో.. భవిష్యత్తు పాడవుతుందని విద్యార్థులను రోడ్ల మీదకు రానివ్వకుండా బెదిరించారన్నారు. ‘ప్రస్తుత ప్రభుత్వం చట్టాలను గౌరవించడం లేదంటున్నారు.. ఆ మాట పలకడానికి మీకు కనీస అర్హత ఉందా?’ అంటూ ధ్వజమెత్తారు. 

ఇంకా ఆ లేఖలో.. ‘ మీ సామాజిక వర్గం మహిళలపై దాడి జరిగితే ‘ఇదేనా ప్రజాస్వామ్యం’ అంటున్నారు. మరి నా భార్యా, కొడుకు, కోడలిపై దాడి జరిగినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా చంద్రబాబునాయుడు?. మాకు జరిగిన అవమానం గురించి లోకానికి చెప్పుకోకుండా అప్పట్లో మీడియాను కట్టడి చేయమని ఏ చట్టం చెప్పిందో సెలవిస్తారా? కాపు ఉద్యమాన్ని చూపించొద్దని మీ పాలనలో  మీడియా సంస్థలను ఆదేశించారు. ఇవాళ మీరు చెప్పిందే చెప్పి మీ మీడియాను మీ సామాజిక వర్గం కోసమే ఉపయోగించుకుంటున్నారు. ఆ మీడియాలో ఇతర కులాలకు వాటా లేదా? మీ వార్తలలాగే ఇతరుల వార్తలు చూపించమని ఎందుకు చెప్పలేకపోయారు. మీది సంసారం? ఇతరులది వ్యభిచారామా? మాజీ గారు.

చందాలతో నేను ఉద్యమం చేస్తున్నానని అప్పటి మీ ఇంటెలిజెన్స్ ఏబీవీతో తప్పుడు ఆరోపణలు చేయించారు. రుజువులతో బహిరంగ పరచమని కోరితే మీకు దమ్ము, ధైర్యం లేక తోక ముడిచేవారు. అలాంటి అబద్దాలు చెప్పే నిప్పులాంటి మీరు ఇవాళ జోలి పట్టి అడుక్కోవడానికి సిగ్గు లేదా?. మీ రాక్షస పాలన నుండి ముందు తెలంగాణ.. తర్వాత ఏపీ ప్రజలు విముక్తి పొంది అదృష్టవంతులయ్యారు. మీ జీవితం అంతా ఆబద్దాలు ఆడడం, వెన్నుపోట్లు పొడవడం. పిల్లనిచ్చిన మామను చెప్పులతో కొట్టించి.. ఇప్పుడు చెప్పులు విడిచి మామ ఫొటోకు దండలు వేస్తున్నారు. ఇలాంటి పనులు చేసే వారిని ప్రజలు నమ్మరు, విశ్వసించరు. అందుకే మీకు శాశ్వతంగా సెలవిచ్చారు. ఆ తీర్పును స్వాగతించి విశ్రాంతి తీసుకోండ’ని అన్నారు.

మరిన్ని వార్తలు