ప్రజల ఆస్తులు.. చంద్రబాబు సొంత ఆస్తులైనట్టు!

11 Jun, 2018 13:47 IST|Sakshi

సింగపూర్‌ కంపెనీలకు దానం చేస్తున్నారు

ప్రభుత్వం తీరుపై ముద్రగడ పద్మనాభం మండిపాటు

సాక్షి, కాకినాడ : ప్రజల ఆస్తులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సొంత ఆస్తులుగా భావించి.. సింగపూర్‌ కంపెనీలకు దానం చేస్తున్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. రైతు జీవితంలో నిత్యం కష్టాలే ఉంటాయని, రైతుల పట్ల సానుభూతి చూపాల్సిన ప్రభుత్వమే వారిని కష్టాలపాలు చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల కోసం అన్ని పార్టీల నేతలతో ఒకే వేదికపైకి వైఎస్‌ జగన్‌, పవన్‌ కల్యాణ్‌ సమావేశం ఏర్పాటు చేయాలని ముద్రగడ కోరారు. రాష్ట్రాన్ని సింగపూర్‌ పాలిత ప్రాంతంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అందరూ కలిసి రాష్ట్రాన్ని, రైతులను, సామాన్య ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరముందని ముద్రగడ అన్నారు. ఈ మేరకు ప్రతిపక్ష నేతలకు ముద్రగడ సోమవారం ఒక లేఖ రాశారు.

‘చంద్రబాబు తన తండ్రి, తాతల ఆస్తులు అయినట్టు భావించి రైతుల భూములను దానం చేస్తున్నారు. ఈ విధంగా ఈ భూములను ధారాదత్తం చేసిన జూన్ 7ను చరిత్రలో చీకటి రోజుగా భావించాలి. ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి పరాయి పాలన నుంచి విముక్తి పొందాం. ఇప్పుడు సింగపూర్ పాలన నుంచి బయటపడేందుకు మరోసారి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. బ్రిటీష్ వారిని మన దేశం నుండి ఎలా తరిమికొట్టామో.. అదేవిధంగా సింగపూర్ కంపెనీని తరిమి కొట్టాలి’  అని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. వామపక్షలను కలుపుకుని పోరాటం చేస్తే.. అందులో పాల్గొనేందుకు.. తనలాంటి వాళ్లు ఎందరో సిధ్ధంగా ఉన్నారని, వైఎస్‌ జగన్, పవన్ కల్యాణ్‌ అన్ని పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఈ విషయమై చర్చించాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు