జగన్‌తోనే దళితులకు రక్షణ : కాపుమాని రాజశేఖర్‌

3 Apr, 2019 14:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దళితులపై దాడుల్లో దక్షిణ భారతదేశంలో ఏపీనే మొదటి స్థానంలో ఉందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కాపుమాని రాజశేఖర్‌ తెలిపారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళిత జాతికి, అంబేద్కర్‌కు జరిగిన అన్యాయం గురించి టీడీపీ నాయకులు ఎందుకు ప్రశ్నించట్లేదన్నారు. టీడీపీ పాలనలో దళితులపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. అంబేద్కర్‌ విగ్రహం పెడుతున్న దళితులను అడ్డుకుని 250 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారని గుర్తు చేశారు. అప్పుడు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి ఆ ఊరు వెళ్లి ఇరు వర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించారని తెలిపారు.

ఎస్సై స్థాయి అధికారి దళిత మహిళపై దాడి చేశారని.. అడిగిన వారిని జైలులో పెట్టారని మండిపడ్డారు. జిల్లాలో టీడీపీ నేతలు మహిళలను వివస్త్రలు చేసి రోడ్‌ మీద తిప్పుతున్నా అడిగే నాథుడు లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాక్‌లాగ్‌ పోస్ట్‌ల రిక్రూట్మెంట్‌ లేదు.. ఫీజు రియంబర్స్‌మెంట్‌ లేదని విమర్శించారు. అంబేద్కర్‌ విగ్రహం పెడతామన్నారు.. దానికి కేటాయించిన రూ. 250 కోట్లు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరు అనుకుంటారు అని చంద్రబాబు మాట్లాడుతుంటే టీడీపీలో ఉన్న దళిత నాయకులు నోరెత్తడంలేదని దుయ్యబట్టారు. వర్ల రామయ్య, చింతమనేని ప్రభాకర్‌ దళితులను అవమానించారు.. అయినా వీరి మీద చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళితలుపై దాడుల్లో దక్షిణ భారతదేశంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. దళితులకు రక్షణ కావాలన్నా, సామాజికంగా.. ఆర్థికంగా ఎదగలన్నా జగన్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే టీడీపీ విలువలు లేని రాజకీయాలు చేస్తుందని మండి పడ్డారు.

మరిన్ని వార్తలు