బాబూ.. రేపు సాక్ష్యాలతో సహా మీడియా ముందుంచుతాం!

18 Jan, 2020 14:19 IST|Sakshi

అమరావతి: రాజధాని పేరుతో చంద్రబాబు అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, ఆయనపై సుప్రీం కోర్టు, హైకోర్టు సుమోటో కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ డిమాండ్‌ చేశారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ధర్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో అనేక మంది అమాయక రైతుల మాగాణి భూములను చంద్రబాబు తన సన్నిహితులకు, కోటరీకి ధారదత్తం చేశారు. రైతుల సొమ్మును నొక్కేశారు. ఇక్కడి రైతుల ఆవేదనను పట్టించుకోలేదు. భూ దందా విధానం హుందాగా వ్యవహరిస్తున్నట్లు బయటకు చెబుతూనే.. మరోపక్క లోకేష్‌, అప్పటి మంత్రులు యనమల, పత్తిపాటి, దూళిపాళ్ల నరేంద్ర, పయ్యవుల కేవశ్‌ ఇలా ఎంతో మందితో రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేయించారు. రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగింది. చంద్రబాబు రాజ్యాంగ ప్రమాణాన్ని తుంగలో తొక్కారు.

చదవండి: ఆ ఎమ్మెల్యేలు దున్నేశారు..!

చదవండి: ‘ఆ వసూళ్లకు లెక్కలు లేవు.. ఇప్పుడు మరో జోలె’

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెబుతూ ప్రజలను మోసం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో లేనప్పుడు మరోలాగా మాట్లాడుతున్నారు. రైతులను అడ్డం పెట్టుకొని చేస్తున్న నాటకాలు, బూటకాలు తేటతెల్లం చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబును యూటర్న్‌ పితామహుడని అందరూ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ హిట్లర్‌గా ఆయన పేరు సార్ధకం చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు విలువైన భూములు తీసుకొని కోట్లకు పడగలెత్తారు. ఇప్పుడేమో జోలె పట్టి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసమే. రాజధాని ప్రాంతంలోని అమాయక రైతులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ రోజు వైఎస్‌ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానిపై సీబీఐ విచారణను డిమాండ్‌ చేయగా.. చంద్రబాబు సభలో బెదిరిస్తూ మాట్లాడారు. మా ప్రభుత్వం రాజధానిపై సీబీఐ విచారణ చేయిస్తుంది. ఇప్పటికే సీఐడీ కూడా రంగంలోకి దిగింది. 

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడిన చంద్రబాబుపై కేంద్ర ప్రభుత్వం, గవర్నర్‌ సుమోటాగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన చంద్రబాబు రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడు. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. సీఎంగా ఉంటూ కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్‌కు 14 ఎకరాలు ధారదత్తం చేశారు. 2014 జూన్‌ 1 నుంచి డిసెంబర్‌ 30 వరకు చంద్రబాబు ఎల్లో గ్యాంగ్‌ అమరావతి పేరుతో  భూదందాకు పాల్పడింది. ఈ రోజు జోలె పట్టి చందాలు వసూలు చేస్తున్నారు. పక్షపాతం వచ్చినట్లు మాట్లాడితే మీకు శిక్ష పడక తప్పదు. మీ అవినీతిని ప్రజల ముందు ఉంచబోతున్నాం. నల్లధనాన్ని కప్పి పుచ్చుకునేందుకు భూములు తక్కువ రేట్లకు కొన్నట్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అందరిపై కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. బినామీదారుల వివరాలు కూడా మీడియా ముందు పెడతాం. చంద్రబాబు హయాంలో షేర్‌ మార్కెట్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష వేయాలన్నారు. ఆ రోజు రాజధాని పేరుతో కోట్లాది రూపాయాలు నొక్కేశారు. మిమ్మల్ని ఎన్నేళ్లు జైల్లో పెట్టాలో చెప్పాలి. సీఎం వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత భూదందాకు పాల్పడినట్లు రుజువు చేస్తే ఎలాంటి చర్యలకైనా తాను సిద్ధం. 

చదవండి: ఈలోగా ఇటు వాళ్లను అటు పంపిస్తాడు!

రాజధాని ప్రాంతం రైతులు చంద్రబాబు హయాంలో బాగుపడింది లేదు. చంద్రబాబు మిమ్మల్ని అడ్డుపెట్టుకొని వ్యాపారం చేశారు. అన్ని ప్రాంతాలు వైఎస్సార్‌సీపీకి సమానమే. కృష్ణా, గుంటూరు జిల్లాలను కూడా ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. జీఎన్‌ రావు, బోస్టర్‌ కమిటీ, శివరామకృష్ణన్‌ కమిటీ, హైపవర్‌ కమిటీల నివేదికల ఆధారంగా రాజధాని విషయంలో ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించాలి. రాజధాని రైతులు మోసం చేసిన చంద్రబాబుపై పోరాటం చేయాలి. రైతులకు రాష్ట్ర ‌ప్రభుత్వం అండగా ఉంటుంది. గతంలో ఇచ్చిన దానికంటే మెరుగైన ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పటికే హైపవర్‌ కమిటీ రాజధాని రైతుల మనోభావాలను సీఎం వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లింది.

అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి జరగాలని, ఇక్కడ మూడు ప్రాంతాల్లో రాజధాని నిర్మాణాలు ఉండాలని, ఏ ప్రాంతం వివక్షకు గురికాకూడదని, గత ప్రభుత్వం మాదిరిగా అమాయకప్రజలను అడ్డుపెట్టుకొని మేం నాయకులుగా చలామణి అవ్వాలన్న ఆలోచన ఎప్పుడు కూడా మాకు ఉండదు. ఎందుకంటే వైయస్‌ జగన్‌ రైతు పక్షపాతి. రైతులకు మేలు చేయాలనే మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబు చేసిన భూదందాల విషయంలో హైకోర్టు, సుప్రీం కోర్టు, కేంద్రం సుమోటోగా స్వీకరించాలి. చంద్రబాబు ఇకనైనా నాటకాలు ఆపేసి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు ఇప్పటికైనా మారాలి. రాజధాని ప్రాంతంలో జరిగిన అన్ని అంశాలను రేపు ఆధారాలతో సహా మీడియా ముందు ఉంచుతుంది. ఇప్పటికే సీఐడీ విచారణ పూర్తి చేసింది. ఇదే వివరాలను కోర్టు ముందు కూడా ఉంచుతాం.

చదవండి: 'గుండు సున్నా దేనితో కలిసినా ఫలితం జీరోనే'

మరిన్ని వార్తలు