కర్ణాటకం : విశ్వాస పరీక్ష రేపటికి వాయిదా

18 Jul, 2019 18:39 IST|Sakshi

బెంగళూర్‌ : కర్ణాటకలో రాజకీయ హైడ్రామా కొనసాగుతూనే ఉంది. విశ్వాస పరీక్షను స్పీకర్‌ ఆర్‌ రమేష్‌ కుమార్‌ శుక్రవారానికి వాయిదా వేశారు. అసెంబ్లీని రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బలపరీక్షను తక్షణమే చేపట్టాలని ఆ పార్టీ నేత యడ్యూరప్ప సభలోనే బైఠాయించడంతో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు.

బలపరీక్షను ఈరోజే నిర్వహించాలని గవర్నర్‌ సందేశాన్ని స్పీకర్‌ పాటించకపోవడం పట్ల బీజేపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా, అంతకుముందు బలపరీక్షను ఈరోజే పూర్తిచేయాలని కర్ణాటక స్పీకర్‌కు రాష్ట్ర గవర్నర్‌ వజూభాయ్‌ వాలా సూచించారు. గవర్నర్‌ సందేశం స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ సభలో చదివి వినిపించారు.

విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కాలయాపన చేస్తున్నాయని బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి  ఫిర్యాదు చేశారు. విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినా, సభకు హాజరు కాకపోయినా ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు తప్పవని సీఎం కుమారస్వామి చివరి ప్రయత్నంగా తమ పార్టీ రెబెల్‌ ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేస్తూ హెచ్చరించారు.

మరోవైపు విప్‌ విషయంపై సుప్రీం కోర్టు స్పష్టత ఇచ్చేంత వరకూ విశ్వాస పరీక్ష చేపట్టవద్దని సీఎల్పీ నేత సిద్ధరామయ్య లేవనెత్తిన పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌పై సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. విశ్వాస పరీక్షను తక్షణమే చేపట్టాలని బీజేపీ సభ్యులు డిమాండ్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు