హస్త విలాసమా? కమల వికాసమా?

15 May, 2018 02:26 IST|Sakshi
సోమవారం బెంగళూరులో కౌంటింగ్‌ కేంద్రం వద్ద పోలీసులు

కన్నడ ఫలితాలపై కాసేపట్లో వీడనున్న ఉత్కంఠ

8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం

మధ్యాహ్నానికి స్పష్టత వచ్చే అవకాశం

కాంగ్రెస్, బీజేపీల్లో టెన్షన్‌

జేడీఎస్‌ చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు  

బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ఫలితాల ఉత్కంఠకు మరికొద్దిగంటల్లో తెరపడనుంది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కన్నడ ఎన్నికల్లో ఓటరు ఎవరికి పట్టం గట్టారనేది తేలిపోనుంది. ప్రీపోల్‌ సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైనట్లు హంగ్‌ అసెంబ్లీ ఏర్పుడుతుందా? అయితే కింగ్‌మేకర్‌ అనుకుంటున్న జేడీఎస్‌ మొగ్గు ఎటువైపు ఉంటుంది? ఈ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ, కాంగ్రెస్‌లలో ఒకరు సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారా? అని కొంతకాలంగా రాజకీయరంగాన్ని తొలుస్తున్న ప్రశ్నలకు సమాధానం దొరకనుంది.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తొలి రెండుమూడు గంటల్లోనే ఫలితాలపై కొంతమేర అంచనా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మధ్యాహ్నానికి స్పష్టత రానుంది. పూర్తి ఫలితాలు సాయంత్రం వరకు వెల్లడవుతాయని తెలుస్తోంది. అసలైన పోటీ బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ఉండనుందనేది సుస్పష్టమే అయినా.. జేడీఎస్‌ గెలుచుకునే సీట్లు కీలకం కానున్నాయి. 222 అసెంబ్లీ సీట్లలో 112 సీట్లు వచ్చిన పార్టీదే అధికారం. దీంతో ఓటరు ఎవరికి ఈ మేజిక్‌ ఫిగర్‌ను కట్టబెట్టాడన్నదానిపై ఈ ఉత్కంఠ.   

సీఎం సిద్దరామయ్యేనా?
కాంగ్రెస్‌పార్టీ సంపూర్ణ మెజారిటీ తెచ్చుకున్నట్లయితే..  1985 తర్వాత వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన నేతగా నిలుస్తారు. అయితే సిద్దరామయ్యనే సీఎంగా ఉంచుతారా? లేక 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దళితనేతకు సీఎం పదవిని కాంగ్రెస్‌ అధిష్టానం కట్టబెడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. పోలింగ్‌ తర్వాత సిద్దరామయ్య ‘దళితనేతపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాన’ంటూ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. అదే జరిగితే సిద్దరామయ్యకు లోక్‌సభ విపక్షనేత మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు జి. పరమేశ్వర ప్రత్యామ్నాయాలుగా కనబడుతున్నారు.  

బీజేపీకి నైతిక బలం
ఒకవేళ బీజేపీ గెలిస్తే.. అది దక్షిణాదిలో కమలం పార్టీ విస్తరణకు ప్రధాన ద్వారంగా మారనుంది. దక్షిణ భారత రాష్ట్రాల్లో ప్రధాని మోదీ హవా వీచేందుకు మరింత అవకాశం కల్పిస్తుంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ కార్యకర్తల్లో నైతికస్థైర్యం పెంచేందుకు దోహదపడుతుంది. ఫలితంపై జేడీఎస్‌ కూడా ధీమాగా ఉంది. తమ పార్టీ అధినేత కుమారస్వామి కింగ్‌ మేకర్‌ కాదని.. కింగ్‌ అవుతారని పేర్కొంది. ఏదేమైనా మరోసారి దేవేగౌడ కన్నడ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుంది.

అత్యంత ఖరీదైన ఎన్నికలుగా..!
కర్ణాటక ఎన్నికలు దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలిచాయి. పార్టీలు, అభ్యర్థులు పోటీలు పడి ఓటర్లపై కాసుల వర్షం కురిపించారని సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ (సీఎంఎస్‌) అనే సంస్థ వెల్లడించింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి డబ్బు, మద్యం పంపిణీ విచ్చలవిడిగా జరిగిందని ఈ సంస్థ పేర్కొంది. అన్ని పార్టీలూ, వ్యక్తిగతంగా అభ్యర్థులు పెట్టిన ఖర్చు మొత్తంగా రూ. 9,500 కోట్ల నుంచి రూ. 10,500 కోట్లు ఉండొచ్చని సీఎంఎస్‌ అంచనావేసింది. ‘దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎన్నికల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కర్ణాటక ఎన్నికల వ్యయం ఆధారంగా 2019 ఎన్నికల్లో రూ.50వేల నుంచి రూ.60వేల కోట్ల ఖర్చు ఉండొచ్చని అంచనావేస్తున్నారు. 2014లో పార్టీలు రూ.30వేల కోట్లు ఖర్చు చేశాయి’ అని సీఎంఎస్‌ ప్రతినిధి భాస్కర్‌ రావు
తెలిపారు.  

ఏమేం జరగొచ్చు...?
కర్ణాటకలో ఫలితాల ఆధారంగా అధికారం ఎవరికి దక్కొచ్చన్న అంశంపై వివిధ అంచనాలు చర్చకొస్తున్నాయి. వీటిని ఓసారి గమనిస్తే..

అంచనా–1: కాంగ్రెస్‌కు పూర్తి మెజారిటీ వస్తే
► ఆ పార్టీకి గొప్ప విజయం అవుతుంది
►  రాహుల్‌ నాయకత్వంపై పార్టీలో విశ్వాసం పెరుగుతుంది
► సిద్దరామయ్య ప్రభావం పెరుగుతుంది
► రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీకి గట్టిపోటీ ఇవ్వగలుగుతుంది

అంచనా–2: బీజేపీకి సంపూర్ణమెజారిటీ వస్తే
► మోదీ–షా జోడీకి తిరుగుండదు
► మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ ఎన్నికలకు మరింత ఉత్సాహం
► దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు మరింత గడ్డుపరిస్థితి
► రాహుల్‌ గాంధీపై పార్టీలోనూ వ్యతిరేకత

అంచనా–3: కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా నిలిచినా మెజారిటీ రాని పక్షంలో..
► సీఎంగా సిద్దరామయ్యను జేడీఎస్‌ తిరస్కరిస్తుంది
► దళిత సీఎం వేటలో కాంగ్రెస్‌ అధిష్టానం
► మల్లికార్జున ఖర్గే, పరమేశ్వరల్లో ఒకరికి అవకాశం
► జేడీఎస్‌ కీలక మంత్రిత్వ శాఖలు కోరే అవకాశం

అంచనా–4: బీజేపీ అతిపెద్ద పార్టీగానిలిచి మెజారిటీ రానిపక్షంలో
► మోదీ–షా వ్యూహం పనిచేస్తుంది
► బీజేపీ – జేడీఎస్‌ కలుస్తాయి
► కుమారస్వామి ఉపముఖ్యమంత్రి అవుతారు
► కాంగ్రెస్‌ తన అవకాశాల్ని కోల్పోతుంది

అంచనా–5: హోరాహోరీ ఉంటే..
► బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది
► జేడీఎస్‌ను చీల్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుంది
► రిసార్టు రాజకీయాలు కీలకంగా మారతాయి
► జేడీఎస్‌ కింగ్‌మేకర్‌గా మారుతుంది 

మరిన్ని వార్తలు