ఓటర్లకు క్రికెట్‌ లెజెండ్‌ పిలుపు, వైరల్‌

12 May, 2018 12:16 IST|Sakshi

దేశం మొత్తం రసవత్తరంగా ఎదురుచూస్తున్న కన్నడ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నేటి(శనివారం) ఉదయం ప్రారంభమైంది. ఈ ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు తమ ఓటింగ్‌ హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అదే రాష్ట్రానికి చెందిన మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ట్విటర్ వేదికగా ఓటర్లకు ఓ స్వీట్‌ మెసేజ్‌ పెట్టారు. ఈ దేశ పౌరులుగా మీ హక్కును వినియోగించుకోవాలంటూ పిలుపునిచ్చారు. ఓటు వేసేందుకు వచ్చిన కుంబ్లే.. తన కుటుంబ సభ్యులతో కలసి పోలింగ్ బూత్ ముందు లైన్‌లో వేచి ఉన్న సెల్ఫీని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఆ సెల్ఫీతో పాటు ఓ మెసేజ్‌ను కూడా పోస్టు చేశారు.

 ‘ ఓటు వేసేందుకు మా వంతు వచ్చే వరకు వేచి చూస్తున్నాం. ఇలాగే ప్రతి ఒక్కరూ దేశ పౌరులుగా మీ ఓటు హక్కు వినియోగించుకోండి’ అని పిలుపునిచ్చారు. ఓటు వేసి వచ్చిన తర్వాత సిరా గుర్తు చూపిస్తూ మరో సెల్ఫీ తీసుకుని దాన్ని కూడా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కుంబ్లే చేసిన ఈ పోస్టింగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పోస్టు చేయగానే దీనికి 17 వేల మంది లైక్ కొట్టగా, 200 మంది రీట్వీట్ చేశారు. ఈ ఉదయం 7 గంటలకు కర్ణాటక వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. మొదటి రెండు గంటల్లోనే 10.6 శాతం ఓటింగ్ నమోదైంది. 58,546 పోలింగ్‌ స్టేషన్లలో ఈ పోలింగ్‌ జరుగుతోంది. ఆరు గంటలకు ఈ పోలింగ్‌ ప్రక్రియ ముగియనుంది. జయనగర్‌, ఆర్‌ఆర్‌ నగర్‌ నియోజకవర్గాల్లో పోలింగ్‌ వాయిదా పడింది. బీజేపీ అభ్యర్థి బీఎన్‌ విజయ్‌ నగర్‌ మృతి చెందడంతో జయనగర్‌ పోలింగ్‌ వాయిదా పడగా.. నకిలీ ఓటర్‌ ఐడీ కార్డుల కలకలంతో ఆర్‌ఆర్‌ నగర్‌ ఎన్నిక వాయిదా పడింది.
 

మరిన్ని వార్తలు