కర్ణాటక ఎన్నికలు ఓ ఐపీఎల్‌ మ్యాచే!

10 May, 2018 18:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఒక కర్ణాటక రాష్ట్రంలో అనేక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ రాష్ట్రంలోనైనా కొన్ని అంశాల చుట్టే ఎన్నికలు జరుగుతాయి. అవే ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయి. కర్ణాటకలో అలా కాదు. ఉత్తర కర్ణాటక నుంచి దక్షిణ కర్ణాటక వెళుతుంటే ఒక్కో అంశం చుట్టూ ఒక్కో ప్రాంతం ఎన్నికలు కేంద్రీకతమై కనిపిస్తాయి. ఉత్తరాదిలోని ముంబై కర్ణాటక ప్రాంతంలో ప్రధాన సమస్య మహాదేవి నదీ జలాల పంపిణీ. తీర ప్రాంతాల్లో మతపరంగా ప్రజల్లో విభజన కనిపిస్తోంది. దక్షిణాదికి వెళితే కావేరీ ప్రాదేశిక ప్రాంతంలో తాండవిస్తున్న కరవు పరిస్థితులే ఎన్నికల్లో ప్రధాన అంశం. గత రెండేళ్లుగా ఆ ప్రాంతంలో వర్షాలు పడలేదు. 

ఈ ప్రాంతాల మధ్యలో ధనవంతులు, మధ్యతరగతి, చిన్న తరగతి ప్రజలు, గ్రామీణ, పట్టణ ప్రజలు దర్శనమిస్తారు. వారి మధ్య రెండు జాతీయ పార్టీల పట్ల పరస్పర భిన్నమైన వైఖరికి కనిపిస్తోంది. కర్ణాటకలో ప్రజలను సామాజికంగా కలిపి ఉంచేది కులం. రాజకీయంగా విడదీసేది కులమే. ఇటీవలి ఎన్నికల్లో వరుసగా ‘వొక్కలిగ లింగాయత్‌’ల ప్రభావమే ఎక్కువగా కనిపించింది. వీరశైవ లింగాయత్‌లకు, ఇతర లింగాయత్‌లకు మధ్య మళ్లీ తేడా ఉంది. దళితులను, ముస్లింలను కలుపుకొని ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య అనుసరిస్తున్న ‘అహింద’ దక్పథంతో ఈ సారి మంచి ఫలితమే ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో డబ్బుతోపాటు శక్తిమంతమైన మఠాల ప్రభావం కూడా ఎన్నికలపై ఎక్కువగా ఉంటుంది. అభ్యర్థుల నేర చరితను కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. అందుకే ఈసారి కాంగ్రెస్, బీజేపీ పార్టీల తరఫున ఎక్కువ మంది నేర చరితులు, డబ్బున్న అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. గనుల్లో కోట్లు కొల్లగొట్టి జైలుకెళ్లి వచ్చిన గాలి సోదరులు కూడా బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. 

అవినీతిని అంతం చేస్తానంటూ ఎల్లప్పుడు నినదించే బీజేపీ కర్ణాటక ఎన్నికల్లో ఈ నినాదాన్ని పక్కన పెట్టింది. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పల విషయానికి వస్తే ఇద్దరూ బలమైన నాయకులే. పలు సామాజిక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం ద్వారా మధ్య, పేద తరగతి ప్రజలకు సిద్ధ రామయ్య దగ్గరయ్యారు. యడ్యూరప్ప ఎప్పుడూ వొక్కలిగ లింగాయత్‌లకు ఎప్పుడూ ఐకాన్‌. ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ తరఫున రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలు ఎన్నికల ప్రచారం నిర్వహించగా, బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షాలు ఎన్నికల ప్రచారం చేశారు. 

ఇలా పలు అంశాలు ఎన్నికలను ప్రభావితం చేయనున్న నేపథ్యంలో సరైన ఓటరు నాడి అంతుపట్టడం లేదు. అన్ని ఎన్నికల సర్వేలు హంగ్‌ ప్రభుత్వాన్నే సూచిస్తున్నాయి. అన్నింటిలోను కాంగ్రెస్‌ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల సర్వేలను మరో రకంగా బేరేజు వేస్తే కాంగ్రెస్‌ పార్టీకి 80 సీట్లకన్నా తగ్గవు. బీజేపీకి 65 సీట్లకన్నా తగ్గవు. జేడీఎస్‌కు 30 సీట్లకన్నా తగ్గవు. అంటే దాదాపు మిగతా 50 సీట్లే ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయన్న మాట. ఐపీఎల్‌ మ్యాచ్‌ లాగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు అనూహ్యమే.

మరిన్ని వార్తలు