ప్రచారం ముగిసింది ఫలితం ఎలా ఉంటుంది?

10 May, 2018 22:26 IST|Sakshi
కర్ణాటక ఎన్నికల ప్రచార చిత్రాలు

శనివారం పోలింగ్‌ జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసినా ఎప్పటిలా ఫలితాలపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. మొత్తం 224 సీట్లకు గాను ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థి మరణంతో ఎన్నిక వాయిదా పడింది. రాష్ట్రంలో పాలకపక్షమైన కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, ప్రాంతీయపక్షమైన జేడీఎస్‌ రెండు వారాలుగా నిర్వహించిన ప్రచారం గతంలో ఎప్పుడూ లేనంత ఉధృతంగా సాగింది. వరుసగా ఐదేళ్లూ సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగడం, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత దాన్ని గద్దె దించేస్థాయిలో కనిపించకపోవడం, ఏడాది కాలంగా సీఎం వినూత్న పోకడలతో కన్నడ ఆత్మగౌరవం, బలహీనవర్గాలకు సామాజిక న్యాయం, లింగాయతులకు ప్రత్యేక మత హోదా వంటి అంశాలను ముందుకు తీసుకురావడంతో ఎన్నికల పోరులో కాంగ్రెస్‌ పార్టీ ధీమాగా నిలబడగలిగింది. మొత్తంమీద హింసాత్మక సంఘటనలు లేకుండా సాగుతున్న ఈ ఎన్నికలు ఏ పార్టీకి సాధారణ మెజారిటీ ఇవ్వకుండా హంగ్ అసెంబ్లీకి దారితీస్తాయనే చాలా వరకు సర్వేలు తేల్చిచెప్పాయి.

బెంగుళూరు నగర సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, సాగు, తాగు నీటి సమస్యలు మొదట్లో ప్రచారంలో ప్రస్తావనకు వచ్చాయి. కాని ఎన్నికల ప్రచారం జోరందుకున్నాక కన్నడ రాజ్యానికి సొంత జెండా, భాష విషయంలో ఉత్తరాది దక్షిణాది తేడాలు, వీరశైవలింగాయతులకు మైనారిటీ మతహోదా, వివిధ ప్రధాన కులాల జనాభా లెక్కలపై లీకులు వంటి కొత్త అంశాలు ప్రచారంలో ముందు నిలిచాయి. అహిందా, భాగ్య పథకాలపైనే సిద్ధూ ఆశలు బీసీలు, ఎస్టీలు, దళితులు, అల్ప సంఖ్యాకవర్గాల(కన్నడంలో అహిందా అనే చిన్న పేరు)కు చేసిన మేలు, అలాగే బడుగు, బలహీనవర్గాలకు ‘భాగ్య’, ఇందిర పేరుతో అమలు చేస్తున్న అనేక సబ్సిడీ, సంక్షేమ పథకాలే కాంగ్రెస్‌ను మరోసారి గెలిపిస్తాయనే ఆశతో సిద్దరామయ్య ఉన్నారు. వివిధ రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్‌ సర్కారుపై జనంలో అసంతృప్తి గురించి బీజేపీ ప్రచారం చేస్తున్నాగాని ప్రధాని నరేంద్రమోదీ జనాకర్షణ శక్తి, వాగ్ధాటితో సృష్టించే ‘మేజిక్’పైనే ఆధారపడుతోంది.

ఇంకా 2014 పార్లమెంటు ఎన్నికల తర్వాత అనేక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి తగినన్ని నిధులు, ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాలు, ఎత్తుగడలతో కాషాయపక్షం విజయాలకు కారకుడనే పేరు తెచ్చుకున్న జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాపై కూడా రాష్ట్ర బీజేపీ ఆశలు పెట్టుకుంది. సాధారణంగా స్థానిక సమస్యలే శాసనసభ ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తాయి. కాని, రెండు జాతీయపక్షాలూ కన్నడ ఎన్నికలను మోదీ, రాహుల్‌ మధ్య పోరాటంగా మార్చేశాయి. ‘ప్రభంజనం’ లేని ఎన్నికలా? కర్ణాటకలో 1989 తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ పాలకపక్షానికి 150 సీట్లు రాలేదు. 1994 నుంచి ఇప్పటి వరకూ హంగ్ ఏర్పడిన సందర్భాలను మినహాయిస్తే పాలకపక్షానికి 115-132 మధ్యే సీట్లు వచ్చాయి. గత ఐదేళ్లలో రాజకీయ సుస్థిరతతో పాటు ఓ మోస్తరుగా సంతృప్తికర పాలన కొనసాగిందనే పేరొచ్చిన మాట వాస్తవమేగాని ఈ ఎన్నికల్లో రెండు పక్షాల్లో దేనికీ అనుకూలంగా గాలి లేదని స్పష్టమౌతోంది.

1985 నుంచీ పాలకపక్షం ఓడిపోయే సంప్రదాయం కారణంగా కర్ణాటకకు స్వింగ్ స్టేట్‌(ఒక్కోసారి ఒక్కోపార్టీకి అవకాశం) అనే పేరొచ్చింది. బీజేపీ కంటే కాంగ్రెస్‌కు రెండు శాతం ఆధిక్యం ఉందని ఎన్నికల ముందు సర్వేలు చెబుతుండగా, పోలింగ్‌ తేదీ నాటికి ఎవరికి ఓటేయాలో తేల్చుకునే ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉంటారని, వారి నిర్ణయం ఏదో ఒక పార్టీకి సాధారణ మెజారిటీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని ఎన్నికల నిపుణులు అంటున్నారు. పైకి కనిపించని ప్రభంజనం రాష్ట్రాన్ని కుదిపేస్తే ఆశ్చర్యకర ఫలితాలు తప్పవు.

మూడోపక్షం జేడీఎస్‌ కింగ్‌మేకరా?
మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ నాయకత్వంలోని జనతాదళ్ఎస్(జేడీఎస్) కిందటి ఎన్నికల్లో బీజేపీతో సమానంగా 40 సీట్లు తెచ్చుకుంది. అయితే ఈ ఎన్నికల్లో బలం తగ్గిపోతుందిగాని హంగ్ అసెంబ్లీలో పాలకపక్షాన్ని నిర్ణయించే స్థితిలో ఈ పార్టీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2004-2007 మధ్య కాంగ్రెస్, బీజేపీతో కలిసి సంకీర్ణ సర్కార్లలో భాగస్వామిగా కొనసాగిన చరిత్ర జేడీఎస్‌ది. త్రిశంకుసభ జోస్యాల నేపథ్యంలో జేడీఎస్ ఎవరితో రహస్య అవగాహన కుదుర్చుకుందనే చర్చ జరుగుతోంది. సిద్దరామయ్యతో దేవెగౌడకున్న శత్రుత్వం, కేంద్రంలో బీజేపీ పాలకపక్షం కావడం వంటి కారణాల వల్ల ఆయన కాషాయపక్షంతోనే చేతులు కలిపే అవకాశాలెక్కువ. ఒకవేళ బీజేపీ కంటే కాంగ్రెస్‌కు చాలా ఎక్కువ సీట్లు వచ్చి, సీఎం పదవి తన కొడుకు కుమారస్వామికి ఇవ్వజూపితే కాంగ్రెస్‌కు మద్దతివ్వడానికి జేడీఎస్ ఒప్పుకునే అవకాశం ఉంది. తప్పని పరిస్థితుల్లో సీఎం పదవికి సిద్దరామయ్యను కాకుండా మరొకరిని ఎంపిక చేయాలని పట్టుబట్టవచ్చు.

ఒకే రాష్ట్రం ఆరు విభిన్న ప్రాంతాలు!
దక్షిణాదిలో ఆరు విభిన్న సామాజిక, భౌగోళిక, రాజకీయ పరిస్థితులున్న రాష్ట్రం కర్ణాటక. బొంబాయి-కర్ణాటక, హైదరాబాద్‌- కర్ణాటకలో కాంగ్రెస్‌కు కొంత అనుకూల వాతావరణం ఉందంటున్నారు. కరావళిగా పిలిచే కోస్తా కర్ణాటకలో మైనారిటీల జనాభా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నందున మతపరమైన ఉద్రిక్తలు ఎక్కువ. ఇక్కడ బీజేపీ అత్యధిక సీట్లు గెలిచే వీలుంది. మధ్య కర్ణాటక లింగాయతుల ఆధిపత్యంతోపాటు యడ్యూరప్పకు పట్టున్న ప్రాంతం. ఈ ప్రాంతంలోని జిల్లాల్లో జీఎస్టీ అమలు వ్యాపారులకు ప్రయోజనకరంగా మారడం ఈసారి బీజేపీకి ఎక్కువ సీట్లు రావడానికి అవకాశముంది. ఇక్కడ బీజేపీకి సామాజిక పునాది ఉన్న లింగాయతులు, బ్రాహ్మణులేగాక కొత్తగా దళితుల్లోని మాదిగలు ఆ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. ఇక బెంగళూరు ప్రాంతంలో కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు ఒక సీటు అదనంగా లభించింది. సహజంగానే నగరప్రాంత ప్రజల్లో ఉండే అసంతృప్తి బీజేపీ బలం పెంచకోవడానికి ఉపకరిస్తుందని కాషాయపక్ష నేతలు అంచనావేస్తున్నారు. పాత మైసూరు ప్రాంతం జేడీఎస్‌కు అత్యధిక సీట్లు అందిస్తోంది. సీఎం సిద్దరామయ్య కూడా ఇదే ప్రాంతానికి చెందిన నేత. అత్యధిక సీట్లున్న(61) ఈ ప్రాంతంలో 2013 ఎన్నికలు బీజేపీకి కేవలం నాలుగు సీట్లే ఇచ్చాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగా బీజేపీ ఈసారి ఎక్కువ సీట్లు సంపాదించగలిగితేనా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితికి చేరుకుంటుంది.

భాషాపరమైన అల్పసంఖ్యాకవర్గాలూ ఎక్కువే
కర్ణాటకలో విభిన్న మతాల ప్రజలతోపాటు కన్నడేతర భాషలు మాట్లాడే భాషాపరమైన అల్పసంఖ్యాకవర్గాల జనాభా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంది. ఉత్తర కర్ణాటకలో మరాఠీ ప్రజలు, తూర్పు, బెంగళూరు, దాని చుట్టు పక్కల జిల్లాల్లో తెలుగు, తమిళం మాట్లాడే జనం ఎక్కువ. ఈ వర్గాల నుంచి ఎమ్మెల్యేలు దాదాపు పాతిక మంది దాకా ఎన్నికవుతున్నారు. సిద్దరామయ్య తెలుగు, తమిళ ఓటర్లపై దృష్టి సారించారు. ఈ వర్గాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన మేలు గురించి ప్రచారం చేస్తున్నారు. హోరాహోరీగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలు ఫలితాలను బాగా ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. కర్ణాటకలో బీజేపీ గెలిస్తేనే పార్టీలో, కాషాయ కుటుంబ పెద్ద ఆరెస్సెస్‌ నాయకుల దగ్గర ఈ ఇద్దరు నేతల పరువు నిలబడుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌కు కర్ణాటక గెలుపు రాహుల్‌ నాయకత్వానికి మంచి ఊపు ఇస్తుంది. అధ్యక్ష పదవి చేపట్టాక తొలి గెలుపు ఇదే అవుతుంది. రాబోయే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి కర్ణాటక ఎన్నికలు కీలకమయ్యాయి.

- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్

మరిన్ని వార్తలు