కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం

18 Jul, 2019 16:37 IST|Sakshi

అసెంబ్లీ 30 నిమిషాలు వాయిదా

సాక్షి, బెంగళూరు : కర్ణాటక  అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. విశ్వాస పరీక్ష వాయిదా వేయాలంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు,  ఈరోజే నిర్వహించాలంటూ బీజేపీ నేతలు పోడియం వద్దకు దూసుకొచ్చారు. దీంతో  స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ సభను 30 నిమిషాలు వాయిదా వేశారు. తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్‌ చేశారని కాంగ్రెస్‌ పార్టీ సభలో సంచలన ఆరోపణలు చేసింది. కిడ్నాప్‌కు సంబంధించి ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు తమకు సమాచారం ఇచ్చారని మంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. తమ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని స్పీకర్‌కు కోరారు.

కిడ్నాప్‌ వ్యవహారంపై స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ సీరియస్‌గా స్పందించారు. కిడ్నాప్‌ అయిన విషయం వాస్తవమేనా కాదా? ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు లాంటి వివరాలతో శుక్రవారం తనకు నివేదిక ఇవ్వాలని హోంమంత్రిని ఆదేశించారు. మరోవైపు విప్‌ విషయంలో క్లారిటీ లేనందున విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. నిన్నటి సుప్రీంకోర్టు తీర్పు గందరగోళంగా ఉందని, విప్‌ జారీచేయడంపై క్లారిటీ ఇచ్చాకనే విశ్వాస పరీక్ష నిర్వహించాలని స్పీకర్‌కు కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. విప్‌పై స్పష్టత వచ్చేవరకు విశ్వాస పరీక్ష వాయిదా వేయాలని కోరారు. కాగా ఈరోజే విశ్వాస పరీక్ష నిర్వహించాలని బీజేపీ పట్టుబడుతోంది. ఓటింగ్‌ నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్‌, జేడీఎస్‌ నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత యడ్యూరప్ప ఆరోపించారు. ఈ రోజే అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ బీజేపీ ఎమ్మెల్యే స్పీకర్‌ పోడియం వద్దకు దూసుకొచ్చారు. దీంతో స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ సభను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. 

గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు
కర్ణాటక అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. అవిశ్వాస పరీక్ష ఎటూ తేలడం లేదు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. ఈ రోజే విశ్వాస పరీక్ష జరిపించాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించాలని బీజేపీ నేతలు గవర్నర్‌ను కోరారు. బీజేపీ ఎమ్మెల్యేల ఫిర్యాదుపై గవర్నర్‌ స్పందించారు.  బలపరీక్షను ఈ రోజే నిర్వహించాలని స్పీకర్‌కు సూచించారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు ఓ సందేశాన్ని పంపారు. గవర్నర్‌ పంపిన సందేశాన్ని స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ సభలో చదివి వినిపించారు.

మరిన్ని వార్తలు