ఎట్టకేలకు యడియూరప్ప కేబినెట్‌

21 Aug, 2019 03:12 IST|Sakshi
మంత్రిగా ప్రమాణం చేస్తున్న శ్రీరాములు

17 మందితో మంత్రివర్గం

సాక్షి, బెంగళూరు: గత నెల 26వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి యడియూరప్ప ఎట్టకేలకు మంగళవారం కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. సుమారు నెల రోజులపాటు సాగిన తిరుగుబాటు పర్వం తరువాత కాంగ్రెస్‌– జేడీఎస్‌ సంకీర్ణ సర్కారును సాగనంపి బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కడం తెలిసిందే. అనేక కసరత్తుల అనంతరం 17 మంది సభ్యులతో కూడిన మంత్రివర్గం మంగళవారం ఏర్పాటయింది. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ వజుభాయివాలా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. 16 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాగా, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు.

నాటి ముఖ్యమంత్రి, నేటి మంత్రి  
బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన వీరశైవ–లింగాయత్, ఒక్కలిగ, బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎక్కువ పదవులు దక్కాయి. 2008లో కర్ణాటక సీఎంగా పనిచేసిన జగదీశ్‌ శెట్టర్‌ ఈసారి మంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి మళ్లీ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. మాజీ డిప్యూటీ సీఎంలు కేఎస్‌ ఈశ్వరప్ప, ఆర్‌.అశోక కేబినెట్‌లో ఉన్నారు. మరో 16 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా 17 జిల్లాలకు కేబినెట్‌లో ప్రాతినిధ్యం దక్కలేదు.

>
మరిన్ని వార్తలు