‘బిర్యానీ తినడానికి టైమ్‌ ఉంది కానీ..’

12 Aug, 2019 21:05 IST|Sakshi

బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై ఆ రాష్ట్ర బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. కొద్ది రోజులుగా కర్ణాటకలో వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న సహాయక చర్యలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. అయితే తాజాగా సిద్దరామయ్య బిర్యానీ పార్టీకి హాజరు కావడంపై కర్ణాటక బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వివరాల్లోకి వెళితే.. సిద్దరామయ్య ప్రాతినిథ్యం వహిస్తున్న బాదామి నియోజకవర్గంలో కూడా వరదల తీవ్రత ఎక్కువగానే ఉంది. దీంతో ట్విటర్‌ వేదికగా ఆయన తన నియోజకవర్గం ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజుల క్రితం తన కంటికి శస్త్ర చికిత్స జరగడం వల్ల వైద్యులు కొన్ని అంక్షలు విధించారని తెలిపారు. అందువల్లే బాదామిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటించలేకపోతున్నట్టు పేర్కొన్నారు. తన కుమారుడు యతీంద్ర బాదామిలో పర్యటిస్తున్నాడని.. అవసరమైన ప్రాథమిక చర్యలు చేపడుతున్నాడని వెల్లడించారు. అలాగే వరద సహాయక చర్యలను సక్రమంగా చేపట్టడం లేదంటూ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

అయితే తాజాగా బక్రీద్‌ పండగను పురస్కరించుకుని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఇంట్లో జరిగిన విందుకు సిద్దరామయ్య హాజరయ్యారు. ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఈ విందులో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కర్ణాటక బీజేపీ సిద్దరామయ్యపై వ్యంగ్యస్త్రాలు సంధించింది. ‘ట్విటర్‌లో ఉపన్యాసలిచ్చే సిద్ధరామయ్యకు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఇంట్లో జరిగిన బిర్యానీ పార్టీకి హాజరు కావడానికి సమయం ఉంటుంది. కానీ బాదామి నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి సమయం లేదు. ఒకవేళ ఆయన బిర్యానీ తినడం మీద పెట్టిన శ్రద్ధ, తన నియోజవర్గంకు వెళ్లడంపై పెట్టుటుంటే.. తనకు ఓటు వేసినవారి అభ్యర్థనలు విని ఉండేవారని’  కర్ణాటక బీజేపీ పేర్కొంది. మరోవైపు కర్ణాటకలో వరదల కారణంగా ఇప్పటివరకు 42 మంది మృతిచెందారు. 12 మంది గల్లంతయ్యారు. 17 జిల్లాలోని 2700 గ్రామాలను వరదలు ముంచెత్తాయి. రెస్క్యూ టీమ్స్‌​ ఇప్పటివరకు 6 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.  

మరిన్ని వార్తలు