యెడ్డీ కేబినెట్‌లో మరో 10 మంది

7 Feb, 2020 06:12 IST|Sakshi
కొత్త మంత్రులతో కర్ణాటక గవర్నర్, సీఎం

కేబినెట్‌ను విస్తరించిన కర్ణాటక సీఎం

సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప గురువారం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయి, బీజేపీ అధికారంలోకి రావడానికి సహకరించిన 10 మంది ఫిరాయింపు నేతలు తాజా విస్తరణలో కేబినెట్‌ మంత్రులుగా చోటు దక్కించుకున్నారు. ఆ 10 మంది నేతలు గత డిసెంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై గెలిచారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ వజూభాయ్‌వాలా గురువారం ఉదయం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

కొత్తవారికి ఈనెల 8వ తేదీన శాఖలు కేటాయించనున్నట్లు సీఎం యడియూరప్ప తెలిపారు. గతేడాది జూలైలో కాంగ్రెస్‌ – జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి 17 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురైన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. వారిలో డిసెంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచిన 10 మంది ఇప్పుడు మంత్రివర్గంలో చేరారు. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన 17 మందికి న్యాయం చేస్తానని గతంలో యడియూరప్ప హామీ కూడా ఇచ్చారు.

బీజేపీ వారికి నో!: తాజా విస్తరణతో కర్ణాటకలో మంత్రివర్గ సభ్యుల సంఖ్య 28కి చేరింది. తదుపరి విస్తరణలో మరో ఆరుగురికి స్థానం కల్పించే అవకాశముంది. ఈ మంత్రివర్గ విస్తరణలో బీజేపీ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించలేదు. ఉమేశ్‌ కట్టి, అరవింద్‌ లింబావలి, సీపీ యోగేశ్వర్‌ అనే ముగ్గురు బీజేపీ నేతలకు అవకాశం కల్పిస్తామని సీఎం ప్రకటించారు. కానీ పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించే విషయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశామని వివరణ ఇచ్చారు. మంత్రివర్గంలో స్థానం కోసం పలువురు ఆశావహుల నుంచి భారీగా ఒత్తిడి వచ్చిన నేపథ్యంలోనే సొంత పార్టీ వారికి ప్రస్తుతానికి అవకాశం కల్పించలేదని తెలుస్తోంది. అవకాశం కల్పించకపోతే పార్టీని వీడుతామనే హెచ్చరికలు కూడా వారినుంచి వచ్చాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బీజేపీకి అసెంబ్లీలో 117 మంది సభ్యులున్నారు.

మంత్రివర్గంలో చోటు దక్కింది వీరికే
ఎస్‌టీ సోమశేఖర్, రమేశ్‌ జార్కిహోళి, ఆనందసింగ్, కె.సుధాకర్, భైరతి బసవరాజు, శివరామ్‌ హెబ్బార్, బీసీ పాటిల్, కె.గోపాలయ్య, కేసీ నారాయణెగౌడ, శ్రీమంత పాటిల్‌.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు