రెబల్స్‌తో కేబినెట్‌ విస్తరణ.. 10 మందికి చోటు

6 Feb, 2020 15:35 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక కేబినెట్‌ విస్తరణ పూర్తయింది. కొత్తగా మరో పది మంది ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో చోటు లభించింది. ఈ మేరకు నూతన మంత్రులతో రాజ్‌భవన్‌ వేదికగా కర్ణాటక గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. తాజాగా 10 మంది చేరికతో కర్ణాటక కేబినెట్ మంత్రుల సంఖ్య 28కి చేరింది. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఎస్‌టీ సోమశేఖర్‌, రమేశ్‌ ఎల్‌. జర్కిహోలీ, ఆనంద్‌ సింగ్‌, కే. సుధాకర్‌, బీఏ బసవరాజ, ఏ. శివరామ్‌ హెబ్బర్‌, బీసీ పాటిల్‌, కే. గోపాలయ్య, నారాయణ గౌడ, శ్రీమంత్‌ బీ పాటిల్‌ ఉన్నారు. వీరందరూ కాంగ్రెస్‌, జేడీఎస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు కావడం గమనార్హం.

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మొత్తం 11 మంది కాంగ్రెస్‌-జేడీఎస్‌ రెబెల్‌ ఎమ్మెల్యేలు గెలుపొందగా.. అందులో పది మందికి మంత్రిపదవులు లభించాయి. ఉప ఎన్నికలో గెలిచిన మరో ఎమ్మెల్యే మహేశ్‌ కుమతల్లికి మంత్రివర్గ విస్తరణలో చోటు లభించలేదు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోయినప్పటికీ  అంతకంటే పెద్ద బాధ్యతను అప్పగిస్తామని సీఎం యడ్యూరప్ప తెలిపారు. గత కుమారస్వామి ప్రభుత్వంపై అవిశ్వాస పరీక్ష, సీఎంగా యడ్యూరప్ప బలపరీక్ష సందర్భంగా కాంగ్రెస్‌-జేడీఎస్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడంతో వీరిపై అప్పటి స్పీకర్‌ అనర్హత వేటు వేశారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసి వీరు గెలుపొందారు.

మరిన్ని వార్తలు