సుమలతకు క్షమాపణలు

11 Mar, 2019 07:43 IST|Sakshi

రేవణ్ణ తరుఫున నేను చెబుతున్నా

సీఎం కుమారస్వామి ప్రకటన  

సాక్షి, బెంగళూరు:   నటి సుమలతా అంబరీశ్‌పై ప్రజాపనుల మంత్రి, తన సోదరుడు హెచ్‌డీ రేవణ్ణ చేసిన వ్యాఖ్యలపై తాను క్షమాపణ చెబుతున్నట్లు ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. ఆదివారం సీఎం అధికారిక నివాసం కృష్ణాలో ఆయన పల్స్‌ పోలియోలో శిశువులకు ఆయన పోలియో చుక్కలు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సుమలతా పోటీ అంశానికి సంబంధించి హెచ్‌డీ రేవణ్ణ చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే ఆయన తరఫున తాను క్షమాపణ అడుగుతున్నట్లు తెలిపారు. హెచ్‌డీ రేవణ్ణ వ్యాఖ్యల వల్ల సిగ్గుపడే పరిస్థితి వచ్చిందని చెప్పారు. మండ్య లోక్‌సభ ఎన్నికల విషయంలో మీడియా ఎందుకంత ఆసక్తి కనపరుస్తోందంటూ ప్రశ్నించారు. ఆపరేషన్‌ కమలకు ఆడియో టేప్‌ కేసు విషయంపై సిట్‌ ఏర్పాటుపై అధికారులే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.  

నాలుగైదు రోజుల్లో సీట్ల సర్దుబాటు  
 వచ్చే లోక్‌సబ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్, జేడీఎస్‌ పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఇంకా ఓ కొలిక్కి రాలేదని కుమారస్వామి తెలిపారు. నాలుగైదు రోజుల్లో ఈ విషయంపై తీర్మానిస్తామని తెలిపారు. శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయి కర్ణాటకకు రావాల్సిన రూ. 2 వేల కోట్ల పరిహారం అందించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. కేంద్రం ప్రకటించిన పరిహారం రూ. 900 కోట్లులోనూ కేవలం రూ. 400 కోట్లు మాత్రమే అందిందనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు.  

మంకీ ఫీవర్‌ నివారణ చర్యలు
మలేనాడు ప్రాంతంలో కనిపిస్తున్న మంగనకాయిలే (మంకీ ఫీవర్‌) వ్యాధి వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంకీ ఫీవర్‌తో మరణించి వారి కుటుంబాలకు పరిహారం ఇచ్చే అంశంపై ఆలోచిస్తున్నామని చెప్పారు. మంకీ ఫీవర్‌తో మరణించిన కుటుంబాలకు పరిహారం ఇస్తే స్వైన్‌ఫ్లూతో మరణించిన వారి కుటుంబ సభ్యులు కూడా పరిహారం కోసం డిమాండ్‌ చేస్తారని తెలిపారు. ఇప్పటివరకు సాగర్‌ తాలూకాలో 8 మంది, తీర్థహళ్లి తాలూకాలో ఇద్దరు మొత్తం 10 మంది మంకీ ఫీవర్‌తో మరణించినట్లు తెలిపారు. అలాగే 1,762 మంది రక్త నమూనాలను పరీక్షలకు పంపించామని చెప్పారు. 272 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారించినట్లు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు