ఈసీ అధికారులు నన్ను వేధిస్తున్నారు: సీఎం

5 Apr, 2019 14:25 IST|Sakshi

బెంగళూరు: తనను ఎన్నికల సంఘం అధికారులు వేధిస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి బాధిత గళం వినిపిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తననే లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారానికి వెళుతున్న సమయంలో సీఎం కుమారస్వామి కాన్వాయ్‌ను ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అడ్డుకొని.. వాహనాలను తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో ఏమీ లభించలేదు.

తన అన్న హెచ్‌డీ రేవణ్ణ కొడుకు ప్రజ్వల్‌ రేవణ్ణ తరఫున ప్రచారం నిర్వహించేందుకు హసన్‌ ప్రాంతానికి సీఎం కుమారస్వామి కాన్వాయ్‌ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. బెంగళూరు-హసన్‌ హైవేలోని చెన్నరాయపట్న చెక్‌పోస్ట్‌ వద్ద సీఎం కాన్వాయ్‌ వాహనాలను ఆపి.. ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించారు.  ఏకంగా తన కాన్వాయ్‌నే ఆపి.. తనిఖీలు చేయడంతో కుమారస్వామి షాక్‌ తిన్నారు. తనను ఎన్నికల సంఘం టార్గెట్‌గా చేసిందని, తనను, తన పార్టీ నేతలను ఎన్నికల సిబ్బంది ఎన్నికల సిబ్బంది వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే, ఇవి సాధారణ తనిఖీలు మాత్రమేనని, ఆ దారిలో వెళ్లిన అన్ని వాహనాలను తనిఖీ చేసినట్టే.. సీఎం కాన్వాయ్‌ను కూడా తనిఖీ చేశామని ఎన్నికల అధికారులు వివరణ ఇస్తున్నారు. మరోవైపు సీఎం కుమారస్వామి, ఆయన తనయుడు నిఖిల్‌ బస చేసిన హోటల్‌లో ఐటీ తనిఖీలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్రం తమను బెదిరించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


 

మరిన్ని వార్తలు