మోదీ టెన్‌ పర్సెంట్‌ వ్యాఖ్యలకు సిద్ధూ కౌంటర్‌

6 Feb, 2018 12:29 IST|Sakshi

సాక్షి, బెంగళూర్‌ : కర్ణాటక సర్కార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ టెన్‌పర్సెంట్‌ (కమీషన్‌) ప్రభుత్వంగా అభివర్ణించడంపై సీఎం సిద్ధరామయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని స్థాయి వ్యక్తి రాజకీయ కోణంలో ఇంతలా దిగజారడం తగదని హితవు పలికారు. తమ ప్రభుత్వాన్ని పదిశాతం సర్కార్‌గా మోదీ మాట్లాడటం బాధ్యతారాహిత్యమని, ఆయన వ్యాఖ్యలు నిరాధారమైనవని సిద్ధరామయ్య పేర్కొన్నారు.

‘యడ్యూరప్ప సీఎంగా పనిచేసిన కాలంలో ఏం జరిగిందో మోదీ ఆయనను అడగాల్సింది...బీజేపీ కర్ణాటకను దోచుకుంది..మైనింగ్‌ స్కామ్‌లో జనార్ధన్‌రెడ్డిలా యడ్యూరప్ప జైలుకు వెళ్లా’ రని సిద్ధూ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్లు గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు లోకాయుక్తను నియమించారా అని నిలదీశారు. గోద్రా అల్లర్లు ఆయన హయాంలోనే జరిగాయన్న సంగతి గుర్తెరగాలన్నారు.

తమపై మోదీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయపూరితమైనవని అన్నారు.యడ్యూరప్ప స్ధాయికి దిగజారి మోదీ మాట్లాడటం కర్ణాటక ప్రజలను అవమానించినట్టేనని సిద్ధూ ఆరోపించారు.

మరిన్ని వార్తలు