బీజేపీపై కర్ణాటక కాంగ్రెస్‌ ‘బీఫ్‌’ వీడియో

22 Jan, 2018 14:54 IST|Sakshi

సాక్షి, బెంగళూర్‌ : బీజేపీకి కాంగ్రెస్‌ పార్టీ సరికొత్త భాష్యం ఇచ్చింది. బీఫ్‌ జనతా పార్టీ అంటూ కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ ఓ సెటైరిక్‌ వీడియోను తయారు చేసింది. బీజేపీ వేషాలు ఎలా ఉన్నాయో చూడండంటూ పేర్కొంటూ అందులో పలు విషయాలను ప్రస్తావించింది. 

‘‘పారికర్‌(గోవా ముఖ్యమంత్రి) ఏమో దిగుమతి చేసుకుంటానంటారు. యోగి(యూపీ సీఎం) ఏమో ఎగుమతి చేస్తారు. రిజ్జూ(కేంద్ర మంత్రి) ఏమో తింటానంటారు. సోమ్‌( యూపీ బీజేపీ ఎమ్మెల్యే) ఏకంగా అమ్ముతున్నారు. బీఫ్‌తో వ్యాపారం కాదు.. వీళ్లు చేసేది ముమ్మాటికీ రాజకీయమే. బీజేపీ ఇక నాటకాలు చాలూ’’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ట్వీటర్‌ పేజీలో ఓ వీడియోను పోస్టు చేసింది.

ఇక వీడియోలో పేర్కొన్న బీఫ్‌ లవర్స్‌ విషయాలను ఓసారి పరిశీలిస్తే.. కర్ణాటక నుంచి గోవాకు బీఫ్‌ దిగుమతిని అడ్డుకోవటంతో అక్కడి బీఫ్‌ వ్యాపారస్థులు ఆందోళన చేపట్టారు. దీంతో సీఎం పారికర్‌ న్యాయపరమైన దిగుమతిని అనుమతిస్తానని హామీ ఇవ్వటంతో వారు శాంతించారు. ఇక గతంలో ఓసారి బీజేపీనే బీఫ్‌ బ్యాన్‌ తెరపైకి తీసుకొచ్చినప్పుడు.. తాను మాత్రం తింటానని.. అడ్డుకోగలరా? అని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిరెన్‌ రిజ్జూ ప్రశ్నించారు.  

ఉత్తర ప్రదేశ్‌ బీజేపీ ఎమ్మెల్యే అయిన సంగీత్‌ సోమ్‌ అల్‌ దువా పేరిట ఓ బీఫ్‌ కంపెనీని స్థాపించారు. అంతేకాదు 2008 దాకా ఆ కంపెనీకి ఆయనే డైరెక్టర్‌ కూడా. వీరితోపాటు కేరళ బీజేపీ నేత మోనే, మేఘాలయా బీజేపీ చీఫ్‌ షీబున్‌, కేంద్ర మంత్రి ఆల్ఫోన్స్‌ కేజే చేసిన కామెంట్లను కూడా వీడియోలో చేర్చింది. ఇక యోగి ఆదిత్యానాథ్‌ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యల మధ్య ‘బీఫ్‌’ గురించి జరిగిన మాటల యుద్ధం తెలిసిందే. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో దూకుడు పెంచిన కాంగ్రెస్‌ పార్టీ ఇలా ఇలా బీజేపీపై విమర్శల పర్వం కొనసాగిస్తోందన్న మాట.

మరిన్ని వార్తలు