సంక్షోభం ముదిరింది

11 Jul, 2019 02:36 IST|Sakshi
ముంబైలో హోటల్‌ బయట పోలీసులతో మాట్లాడుతున్న మంత్రి డీకే శివకుమార్‌

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం మనుగడపై కొనసాగుతున్న ఉత్కంఠ

ముంబై హోటల్‌ వద్ద ౖహె డ్రామా

డీకే శివకుమార్‌ లోపలకు వెళ్లకుండా పోలీసుల అడ్డగింత

అదుపులోకి తీసుకుని బలవంతంగా బెంగళూరుకు తరలింపు

మిలింద్‌ దేవరా, నసీం ఖాన్‌లూ పోలీసుల అదుపులోకి

హోటల్‌ మార్గంలో భారీ సంఖ్యలో పోలీసులు  

బెంగళూరులో మొదలైన కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వ సంక్షోభం ముదిరి ముంబై, ఢిల్లీలకూ విస్తరించింది. బెంగళూరులో కాంగ్రెస్‌ నేత, మంత్రి నాగరాజ్, ఎమ్మెల్యే సుధాకర్‌లు బుధవారం రాజీనామా సమర్పించడంతో హైడ్రామా మొదలైంది. రాజీనామావేళ ఎమ్మెల్యే సుధాకర్‌ను కాంగ్రెస్‌–జేడీఎస్‌ నేతలు నిర్బంధించగా, గవర్నర్‌ జోక్యంతో బయటపడ్డారు. ముంబైలోని 10 మంది రెబెల్‌ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వెళ్లిన మంత్రి శివకుమార్‌ను పోలీసులు హోటల్‌ గేటు వద్దే అడ్డుకున్నారు. అనంతరం బలవంతంగా బెంగళూరుకు వెళ్లే విమానం ఎక్కించారు. మరోవైపు స్పీకర్‌ తమ రాజీనామాలను ఆమోదించట్లేరంటూ రెబల్‌ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. దీంతో, కన్నడ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ముంబై: కర్ణాటక రెబెల్‌ ఎమ్మెల్యేలు ఉంటున్న ముంబైలోని రినైసన్స్‌ హోటల్‌ వద్ద బుధవారం హై డ్రామా నడిచింది. ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు వచ్చిన కర్ణాటక మంత్రి, కాంగ్రెస్‌లో కీలక నేత డీకే శివకుమార్‌ను హోటల్‌ లోపలికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుని కొన్ని గంటల అనంతరం బలవంతంగా బెంగళూరుకు పంపారు. అంతకుముందు హోటల్‌ బయట శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతుండగా, పోలీసులు ఆయనను పక్కకు లాగేసినంత పనిచేసి, వ్యానులో కూర్చోబెట్టుకుని వెళ్లిపోయారు.

తాను ఆ హోటల్‌లో రిజర్వేషన్‌ చేసుకున్నాననీ, తనను లోపలకు వెళ్లనివ్వాలని శివకుమార్‌ కోరినా ముంబై పోలీసులు పట్టించుకోలేదు. శివకుమార్‌ను కలిసేందుకు హోటల్‌ వద్దకు వచ్చిన మహారాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు మిలింద్‌ దేవరా, నసీం ఖాన్‌లను కూడా పోలీసులు శివకుమార్‌తోపాటే అదుపులోకి తీసుకుని, వారు ముగ్గురినీ కలీనా ప్రాంతంలోని ఓ అతిథి గృహానికి తరలించారు. కొద్దిసేపటి అనంతరం దేవరా, ఖాన్‌లను విడిచిపెట్టి, శివకుమార్‌ను నేరుగా ముంబై విమానాశ్రయానికి బలవంతంగా తీసుకెళ్లి బెంగళూరు విమానం ఎక్కించారు. కాగా, రినైసన్స్‌ హోటల్‌లో మొత్తం 12 మంది కర్ణాటక రెబెల్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు.

వారిలో ఏడుగురు కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు. ఉదయం 8.20 గంటలకే శివకుమార్‌ హోటల్‌ వద్దకు చేరుకోగా, ఆయనను లోపలకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, శివకుమార్‌ల నుంచి తమకు ప్రాణహాని ఉందనీ, వారిని హోటల్‌ లోపలకు రానివ్వద్దంటూ రెబెల్‌ ఎమ్మెల్యేలు తమను కోరారని పోలీసులు చెప్పారు. హోటల్‌ బయట ఉన్నవాళ్లు ‘శివకుమార్‌ వెనక్కు వెళ్లిపోవాలి’ అంటూ నినాదాలు కూడా చేశారు. హోటల్‌ బయట, ఆ మార్గంలో భారీ సంఖ్యలో పోలీసు సిబ్బందిని మహారాష్ట్ర ప్రభుత్వం మోహరించింది. హోటల్‌ సెక్యూరిటీ గార్డులు, కెమెరాల సిబ్బంది, విలేకరులు, పార్టీ కార్యకర్తల మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది.
 

వెనక్కి తీసుకెళ్లగలననే నమ్మకంతో వచ్చా..
పోలీసులు తనను అదుపులోకి తీసుకోడానికి ముందు శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ తాను రెబెల్‌ ఎమ్మెల్యేలతో శాంతంగా చర్చలు జరపడం కోసమే వచ్చానన్నారు. తన వద్ద ఏ ఆయుధమూ లేదనీ, భద్రతా సిబ్బందిని కూడా వెంట తెచ్చుకోలేదనీ, కేవలం మాట్లాడేందుకే ఇక్కడకు వచ్చానని ఆయన వెల్లడించారు. లోపల ఉన్న ఎమ్మెల్యేలంతా గత 40 ఏళ్లుగా తనకు మిత్రులనీ, వారితో కలిసి కాఫీ తాగుతూ మాట్లాడటానికి ఇక్కడకు వచ్చాననీ, అయినా తనను లోపలకు వెళ్లనివ్వడం లేదని శివకుమార్‌ తెలిపారు. కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతుండకపోతే తనను ఎందుకు లోపలకు వెళ్లనివ్వడం లేదనీ, ఏ ఆయుధమూ లేకుండానే తన మిత్రులకు తానెలా హాని తలపెట్టగలనని ఆయన ప్రశ్నించారు. వారితో మాట్లాడితే తాను వారిని కర్ణాటకకు వెనక్కి తీసుకెళ్లగలనన్న నమ్మకం తనకు ఉందని శివకుమార్‌ చెప్పారు. ఎమ్మెల్యేలను కలవనీయకుండానే శివకుమార్‌ను పోలీసులు వెనక్కు పంపేశారు.

బీజేపీ ప్రజాస్వామ్యం గొంతునులుముతోంది: చవాన్‌
కర్ణాటక ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనీ, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపరచడం ద్వారా ప్రజాస్వామ్యం గొంతును ఆ పార్టీ నులుముతోందని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చవాన్‌ ఆరోపించారు. బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి చేటని ఆయన అన్నారు. చవాన్‌ మాట్లాడుతూ కర్ణాటకలో ప్రభుత్వాన్ని అస్థిరపరచడాన్ని మహారాష్ట్ర సీఎం, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రోత్సహిస్తున్నారనీ, రెబెల్‌ ఎమ్మెల్యేలను ముంబైలోని హోటల్‌లో బంధించారని చవాన్‌ మండిపడ్డారు. గతంలో గోవా, మణిపూర్‌ల్లోనూ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేసిందని చవాన్‌ అన్నారు. రెబెల్‌ ఎమ్మెల్యేల్లో అత్యధికులు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలేననీ, కానీ వారిని కలిసేందుకు కాంగ్రెస్‌ నాయకులనే లోపలకు అనుమతించని విషయాన్ని అందరూ గుర్తించాలని చవాన్‌ కోరారు. శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతుండగా, పోలీసులు ఆయనను పక్కకు లాగేసినంత పనిచేయడం గర్హనీయమన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా