తాజ్‌కృష్ణలో కర్ణాటక కాంగ్రెస్‌ కీలక భేటీ

18 May, 2018 18:46 IST|Sakshi
తాజ్‌కృష్ణలో కాంగ్రెస్‌ నేతలు

సాక్షి, హైదరాబాద్‌ : కర్ణాటక అసెంబ్లీలో శనివారం బల నిరూపణను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కాంగ్రెస్‌- జేడీఎస్‌ అధినేతలు చర్చిస్తున్నారు. ఇక్కడి తాజ్‌కృష్ణ హోటల్‌లో కర్ణాటక సీఎల్పీ సమావేశం నిర్వహించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో మాజీ సీఎం సిద్దరామయ్య, కర్ణాటక పీసీసీ చీఫ్‌ కీలక భేటీలో పాల్గొన్నారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి బలపరీక్షలో నెగ్గాలని నేతలకు సూచించారు. తమ కూటమి అభ్యర్థి కుమారస్వామికే సీఎం పీఠం దక్కేలా చూసేందుకు అంతా సంసిద్ధం కావాలని సూచించారు. శనివారం బల నిరూపణ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు జైపాల్‌రెడ్డి, మధుయాష్కీ, కుంతియలు పాల్గొన్నారు. 

మరోవైపు జేడీఎస్‌ అధినేత, కూటమి సీఎం అభ్యర్థి కుమారస్వామి బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వచ్చారు. తాజ్‌కృష్ణకు కుమారస్వామి చేరుకుని కాంగ్రెస్‌ నేతలను కలుసుకున్నారు. నోవాటెల్‌ నుంచి జేడీఎస్‌ ఎమ్మెల్యేలు తాజ్‌కృష్ణకు రానున్నారు. అక్కడ కాంగ్రెస్‌, జేడీఎస్‌ కీలక సమావేశం అనంతరం రాత్రి బెంగళూరుకు పయనం అవుతారు. రెండు ప్రత్యేక విమానాల్లో కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బెంగళూరు వెళ్లనున్నట్లు సమాచారం.

కాగా, కర్ణాటక గవర్నర్‌ వజుభాయ్‌ వాలా ప్రొటెం స్పీకర్‌గా కేజీ బోపన్నను నియమించి మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఆర్డర్‌ ఇచ్చిన ఐదు నిమిషాల్లోనే బోపన్నతో ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. అయితే 8సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన దేశ్‌పాండేను పక్కనపెట్టి బోపన్నను ప్రొటెం స్పీకర్‌గా నియమించడంపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

మరిన్ని వార్తలు